ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన యాభై రోజుల పాలనలో.. ప్రజలకు… పథకాల ప్రకటన చేశారు కానీ.. ఇంత వరకూ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా అందలేదు. చివరికి ఉద్యోగులకు.. 27 శాతం ఐఆర్ ఇచ్చామని ప్రకటించారు కానీ.. గత నెల జీతంతో ఇవ్వలేదు. ప్రమాణస్వీకారం చేసినప్పుడు నిర్ణయం… ఈ నెలలో సంతకం పెట్టి.. వచ్చే నెల నుంచి ఇస్తామని చెబుతున్నారు. ఆశావర్కర్ల జీతాల దగ్గర్నుంచి.. అన్నీ పెండింగే. కానీ.. ఒక్క విషయంలో.. మాత్రం.. శరవేగంగా నిర్ణయాలు తీసుకుని విధులు విడుదల చేసేస్తున్నారు. ఆ నిర్ణయాలు… ముఖ్యమంత్రికి సంబంధించినవే. ముఖ్యమంత్రి ఇళ్ల సౌకర్యలను మెరుగుపర్చడానికి అవసరమైనవే….!
లోటస్ పాండ్‌లో టాయిలెట్లు, సీసీ కెమెరాల కోసం రూ. పాతిక లక్షలా..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్‌లో నివాసం ఉంటుంది. అది ఆయన ఇల్లు అని ప్రపంచం మొత్తానికి తెలుసు . కానీ రికార్డుల్లో మాత్రం ఉండదు… అది వేరే విషయం. ఇప్పుడు ఆయన సీఎం కాబట్టి.. ఆయన ఇంటికి భద్రతా ఏర్పాట్లు చేయడానికి ఏకంగా.. రూ. 24 లక్షల 50వేలు మంజూరు చేస్తూ.. ప్రభుత్వం జీవో జారీ చేసేసింది. ఈ డబ్బులు పెట్టి.. లోటస్ పాండ్ ఇంటికీ.. సెక్యూరిటీ ” యాక్సెసరీస్ ” బిగిస్తారట. సీసీ కెమెరాలు, బ్యాగేజీలు చెక్ చేసే స్కానర్, సెక్యూరిటీ కోసం టాయిలెట్లు .. ఇతర చిల్లర పనుల కోసం.. ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. ఇక్కడ చెప్పాల్సిందేమిటంటే.. ఇది అంచనాలేనట… అంత కన్నా ఎక్కువ అయితే.. తర్వాత విడుదల చేస్తారట. ఎంత విడుదల చేస్తారనేది.. బయటకు రాకపోవచ్చు కూడా..!
ప్రైవేటు గృహాలకు రూ. కోట్ల ప్రజాధనంతో ముస్తాబులా..?
జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా పూర్తి కాలం.. అమరావతిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. గెలవక ముందే.. అక్కడ ఓ ఇంటిని నిర్మించుకున్నారు. కానీ గెలిచిన తర్వాత ఆ ఇంటికి… రూ. కోట్లు పెట్టి ముస్తాబులు చేయించుకున్నారు రూ. ఐదు కోట్లు పెట్టి డబుల్ లైన్ రోడ్డు వేయించుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో ఎలక్ట్రికల్ స్విచ్ ల దగ్గర్నుంచి ఏసీ ల వరకూ .. ప్రజల సొమ్ముతోనే కొనుగోలు చేశారు. అక్కడా సెక్యూరిటీ ఏర్పాట్ల కోసం.. రూ. లక్షలు వెచ్చించారు. ఒక బాత్రూమ్ని రూ. 30 లక్షలు ఎస్టిమేషన్‌తో నిర్మిస్తున్నారు. తాడేపల్లిలోని జగన్ ఇంటిపై.. ప్రభుత్వం ఇప్పటి వరకు .. రూ. పది కోట్లకుపైగానే ఖర్చు చేసిందని జీవోలు చెబుతున్నాయి. అవన్నీ అంచనాలే.
యలహంక, కడప, పులివెందుల ఇళ్లకు ఎన్ని కోట్లు కావాలో..?
జగన్మోహన్ రెడ్డికి… ఊరూరా ప్యాలెస్‌ల లాంటి ఇళ్లు ఉన్నాయి. మొదటగా… ఇడుపులపాయలో.. అతి పెద్ద ఎస్టేట్ ఉంది. తర్వాత పులివెందులలో.. ఓ కోట ఉంది. కడపలోనూ.. అంతకు మించిన ఇల్లు ఉంది. ఆ తర్వాత బెంగళూరు శివార్లలోని యలహంకలో ఉన్న ప్యాలెస్ గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. ఆ తర్వాత లోటస్ పాండ్.. ఇప్పుడు తాడేపల్లి నివాసం. తాడేపల్లి నివాసానికి, లోటస్‌పాండ్‌కు… ప్రజాధనంతో మెరుగులు దిద్దడానికి రూ. కోట్లు కేటాయించారు. ఇక మిగిలింది… ఇడుపుల పాయ, పులివెందుల, కడప, యలహంకల్లోని ఇళ్లే. వీటికి కూడా.. త్వరలో.. కావాల్సిన సౌకర్యాలన్నింటికీ కల్పించేస్తూ.. జీవోలు జారీ చేసినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఎంతైనా 151 సీట్లతో సీఎం అయిన జగన్ కు ఆ మాత్రం ప్రజాధనాన్ని.. సొంత అవసరాలకు వాడుకునే హక్కు ఉంటుందేమో..?