24 Kisses Sameeksha
తెలుగు360 రేటింగ్: 1/5
అర్జున్‌రెడ్డి… ఆర్.ఎక్స్.100 చిత్రాలు విజయం అందుకొన్నాక బోల్డ్ కంటెంట్‌కి ప్రాధాన్యం పెరిగింది. ఘాటైన సన్నివేశాలతో యువతరాన్ని ఆకర్షించొచ్చనే అభిప్రాయానికొస్తున్నారు చాలామంది దర్శకనిర్మాతలు. అందుకే కథ కంటే కూడా బోల్డ్ కంటెంట్‌పైనే ఎక్కువగా దృష్టిపెడుతూ సినిమాలు తీస్తున్నారు. `మిణుగురులు` లాంటి ఒక విభిన్నమైన సినిమాని తీసి కొత్త ఆలోచనలున్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి కూడా అదే ప్రయత్నం చేశాడా? `24 కిస్సెస్` అంటూ పేరులోనే ముద్దుల్ని మూటగట్టుకొన్న ఈ చిత్రం ఎలా ఉంది? ప్రచార చిత్రాలతో కావల్సినంత ప్రచారం చేసుకొన్న ఈ చిత్రం థియేటర్లో ఏ మేరకు మెప్పించింది?
కథ
ఆనంద్ (అరుణ్ అదిత్), శ్రీలక్ష్మి (హెబ్బా పటేల్)… ఈ ఇద్దరికీ సినిమాలంటే ప్రేమ. ఆనంద్ చిన్న పిల్లల చిత్రాలు తీసే దర్శకుడు. శ్రీలక్ష్మి ఏమో మాస్ కమ్యూనికేషన్ చదువుతూ లఘు చిత్రాలు తీస్తుంటుంది. వర్క్‌షాప్ వల్ల ఆనంద్, శ్రీలక్ష్మి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆనంద్కి ప్రేమ, పెళ్లిపై నమ్మకం ఉండదు. శ్రీలక్ష్మి మాత్రం అందుకు భిన్నం. మరి వీరి బంధం ఎక్కడిదాకా చేరింది? ఈ బంధానికీ 24 ముద్దులకీ మధ్య సంబంధమేమిటి? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.
విశ్లేషణ
ప్రేక్షకుల్ని రెండున్నర గంటలు థియేటర్లో కూర్చోబెట్టడం ఓ కళ. చెప్పాలనుకున్న కథని ఆసక్తికరంగా చెబుతూనే… హాస్యం, భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేయాలి. అలా కాకుండా తెలిసిన విషయాలన్నింటినీ ఏకరువు పెడుతూ, మేథోసంపత్తినంతా ఉపయోగించి కథని అటు ఇటూ తిప్పుతామంటే చూసేంత ఓపిక ప్రేక్షకుడికి ఉండదు. ఈ సినిమాలో మాత్రం చెప్పాలనుకొన్న కథని సాగదీస్తూ మధ్యలో బోల్డ్ కంటెంట్‌ని చొప్పిస్తూ, డాక్యుమెంటరీలా చూపించాల్సిన విషయాలన్నింటినీ మధ్యలో ఏకరవు పెడుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాడు దర్శకుడు. నిజానికి ఈ కథని లివింగ్ రిలేషన్స్ నేపథ్యంలో ఆసక్తికరంగా చెప్పొచ్చు. కానీ దర్శకుడికి కథపైనే స్పష్టత కొరవడింది. ఆరంభం బాగానే ఉన్నా… దాన్ని ఎలా ముగించాలో అర్థం కాలేదు. కథ ఎత్తుగడ బాగున్నప్పటికీ ఆ తర్వాత దాన్ని ముందుకు నడిపించే విధానమే ఏమాత్రం మింగుడుపడదు. కవితాత్మకంగా కథని చెబుతున్నాననే భ్రమలో దర్శకుడు సన్నివేశాల్ని తీసుండొచ్చు కానీ… కథ ఇంత కూడా ముందుకు నడిపించలేక ఆద్యంతం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంటాయి. ఒక దశలో ఈ సినిమాలో కథనేది ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది. కథానాయకుడు ఒకసారి ప్రేమంటే ఏంటో తెలియదంటాడు. ఆ తర్వాత ప్రేమ గురించి తెలిసిందంటాడు. మరికొంతసేపటి తర్వాత ప్రేమ ఓకే కానీ, పెళ్లి, పిల్లలు మాత్రం వద్దంటాడు. ఈ ప్రహసనమంతా తెరపై సైకో థెరపిస్ట్‌గా కనిపించే రావు రమేష్ పాత్రకి కూడా పిచ్చెక్కిస్తుందంటే, ఇక ప్రేక్షకుడి పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఈ కథని ముద్దులతో ముడిపెట్టిన విధానం కూడా ఏమాత్రం అతకలేదు. మొదట ఒకట్రెండు ముద్దుల గురించి చెప్పిన కథానాయకుడు ఆ తర్వాత 23 ముద్దుల వరకు ఒక పాటలో చూపించేసి టైటిల్‌కి జస్టిఫికేషన్ అనిపిస్తారు. ఇంకొక్క ముద్దు గురించి పతాక సన్నివేశాల్ని భరించమని చెప్పకనే చెబుతాడు దర్శకుడు. `మిణుగురులు` చేసే సమయంలో దర్శకుడు అయోధ్యకుమార్ పడిన కష్టాలన్నింటినీ ఈ చిత్రంలో కథానాయకుడి పాత్ర ద్వారా ఏకరువు పెట్టించాడు దర్శకుడు.
నటీనటులు… సాంకేతికత
అరుణ్ అదిత్, హెబ్బా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీనే పండింది. రావు రమేష్ సైకో థెరిపస్ట్గా కథని ముందుకు నడిపించే పాత్రలో కనిపిస్తాడు. అదితి మ్యాకల్, నరేష్ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుందంతే. జోయ్ బారువా సంగీతం చెప్పుకోదగ్గ రీతిలో ఏమీ లేదు. ఉదయ్ గుర్రాల కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి రచనలోనూ, దర్శకత్వంలోనూ చాలా లోపాలు కనిపిస్తాయి. మిణుగురులు ప్రభావం నుంచి బయటికొచ్చి కథని కథగా చెప్పుంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
తీర్పు
`ఈ విషయాన్ని స్వయంవరంలోనే వేణు తొట్టెంపూడి చెప్పారు`, `అందరూ ప్రశాంతంగా ఉండండి`,`అసలు నీవేం చెబుతున్నావో క్లారిటీగా చెప్పారా బాబూ?` — ఈ డైలాగులన్నీ సినిమాలో వినిపించేవే. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి కూడా అచ్చం ఇవే అభిప్రాయాలు కలుగుతుంటాయి.
ఫైనల్ టచ్: 24 గుద్దులు
తెలుగు360 రేటింగ్: 1/5