తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసే సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ఎవరూ ఇవ్వని విధంగా తాము వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నామని తెలంగాణ సిఎం కెసియార్ ప్రకటించారు. కొన్ని రోజుల పాటు ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసిన తర్వాత వచ్చే రబీ నుంచి నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. తెరాస సభ్యుల హర్షధ్వానాల మధ్య ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తిలో అనూహ్య ప్రగతి సాధించిందని ఆయన గణాంకాలతో వివరించారు. సబ్స్టేషన్ల సంఖ్యను బాగా పెంచామని, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పై చర్చ సందర్భంగా బుధవారం కెసియార్ ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం ప్రకటించినట్టుగా గాని నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేయడం అంటూ జరిగితే అది తెలంగాణ రైతులకు తప్పకుండా మేలు చేసేదే అవుతుంది అనడంలో సందేహం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణకు గాను విప్లవాత్మక రీతిలో మిషన్ కాకతీయ చేపట్టింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ సత్ఫలితాలు ఇస్తున్నట్టు సమాచారం అందుతోంది. దీని వల్ల గత ఏడాదితో పోలిస్తే సాగు భూమి విస్తీర్ణం పెరిగిందని తెలంగాణ మంత్రి హరీష్రావు వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగానే ఉన్న నేపధ్యంలో తెలంగాణ సర్కార్ చేపడుతున్న ఉపశమన చర్యలు అవసరమైనవే.