అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా పేరు పొందిన ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలు ప్రపంచంలోని తెలుగు కమ్యూనిటీని ఆకర్షిస్తుంటుంది. ఎందుకంటే ఈ మహాసభలకు అమెరికా నలుమూలలా ఉన్న తెలుగువారితోపాటు అమెరికాలోని రాజకీయ ప్రముఖులు, ఇండియాలో ఉన్న రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు, సినీతారలు, ఇతరులు తరలివచ్చి కనువిందు చేస్తుంటారు. అలాగే తానా ఈ మహాసభల సమయంలో అందరినీ ఆకట్టుకునే నినాదంతో ముందుకు వస్తుంటుంది. ఈసారి కూడా తానా 24వ ద్వై వార్షిక మహాసభలను కనువిందుగా జరిపేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా తొలి అడుగుగా మహాసభల లక్ష్యానికి అనుగుణమైన నినాదాన్ని రెడీ చేసింది. తరతరాల తెలుగుదనం – తరలివచ్చే యువతరం’’ అన్న నినాదంతో ముందడుగు వేసింది. తెలుగుదనానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చే తానా ఈసారి మహాసభలకు ఆ నినాదంతోనే ముందుకు రావడం విశేషం. ఈ మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో జరగనున్నది.
అనుకూలమైన వేదిక…
డిట్రాయిట్లోనూ, దాని చుట్టుప్రక్కల ఎంతోమంది తెలుగువాళ్ళు నివసిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని వారికి కూడా ఈ ప్రాంతం అనువైనది. దానిని దృష్టిలో పెట్టుకునే నిర్వాహకులు మహాసభలకు వేదికగా డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ ను ఎంపిక చేశారు. అనుకూలమైన ప్రాంతంలో మహాసభల వేదికను ఏర్పాటు చేసిన తరువాత కాన్ఫరెన్స్‌కు అవసరమైన ఇతర కార్యక్రమాలపై నిర్వాహకులు దృష్టిని కేంద్రీకరించారు.
కోర్ కమిటీ ఏర్పాటు
కాన్ఫరెన్స్ నిర్వహణకోసం ఏర్పాటు చేసిన కోర్ కమిటీలో సమన్వయకర్త ఉదయ్ కుమార్ చాపలమడుగుతోపాటు కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ల గంగాధర్, కో కో ఆర్డినేటర్ శ్రీనివాస్ కోనేరు, డైరెక్టర్ సునీల్ పాంట్ర, సెక్రటరీ కిరణ్ దుగ్గిరాల, ట్రెజరర్ జోగేశ్వరరావు పెద్దిబోయిన, తానా ఉత్తర ప్రాంత ప్రతినిధి నీలిమ మన్నెతోపాటు తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు ఉన్నారు.
ప్రచార కార్యక్రమాలు
తానా మహాసభలకు 3నెలలు ముందుగానే ప్రచార కార్యక్రమాలను చేపట్టేందుకు తానా నాయకులు సిద్ధమయ్యారు. మార్చి నెల నుంచి ఈ ప్రచార కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా కమ్యూనిటీని కాన్ఫరెన్స్‌లో భాగస్వాములను చేసేందుకు వీలుగా వివిధ కార్యక్రమాలను వివిధ నగరాల్లో నిర్వహించనున్నారు. ఇందులో థీమ్ తానా పోటీలను వివిధ నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఆటల పోటీలు, స్థానిక ప్రముఖులతో సమావేశాలు వంటివి కూడా నిర్వహించనున్నారు. ప్రచార కార్యక్రమాలతోపాటు నిధుల సేకరణ కార్యక్రమాలకు కూడా రూపకల్పను చేస్తున్నారు. కాన్ఫరెన్స్‌కు అమెరికాలో ఉన్న వివిధ రంగాల ప్రముఖులను, కళాకారులను, సాహితీవేత్తలను, అమెరికా చట్టసభల ప్రతినిధులను ఆహ్వానించనున్నారు.
ఆకట్టుకునేలా నినాదం…
24వ తానా మహాసభల లక్ష్యానికి అనుగుణమైన నినాదాన్ని ఖరారు చేశారు. యువతరం మరియు నైపుణ్యం ప్రధాన అంశాలుగా 9 నినాదాలను మేధావులు సూచించారు. అందులో అభిప్రాయ సేకరణ ద్వారా, అత్యంత ఆదరణ పొందిన ‘తరతరాల తెలుగుదనం, తరలివచ్చే యువతరం’ అన్న నినాదాన్ని 24వ తానా మహాసభల నినాదంగా ఖరారు చేశారు.
తెలుగుదనానికి పెద్దపీట
ఈ మహాసభల్లో పదహారణాల తెలుగువైభవం కనిపించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్లు కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ, సమన్వయకర్త ఉదయ్ కుమార్ చాపలమడుగు తెలిపారు. ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయని, రాజకీయ నాయకులతో సమావేశాలు, సినీ తారలతో మీట్ అండ్ గ్రీట్, సంగీత విభావరులు ఇలా ఎన్నో జనరంజకమైన కార్యక్రమాలను మహాసభల్లో ఏర్పాటుచేయనున్నట్లు వారు వివరించారు.
ఈ మహాసభల్లో నోవైలో ఉన్న తెలుగు కమ్యూనిటీ, డెట్రాయిట్ తెలుగు సంఘం నాయకులు భాగస్వాములవుతున్నారని, అందరి సహకారంతో ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు.