హైదరాబాద్: ముస్లిమ్‌లను అమెరికాలోనికి రానీయకుండా నిషేధం విధించాలని రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను అధికశాతం అమెరికన్లు వ్యతిరేకిస్తున్నా, ఆ ప్రతిపాదనకు మద్దతు కూడా బాగానే ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ వ్యాఖ్యల తర్వాత జరిపిన మొట్టమొదటిసారి జరిపిన ఒక జాతీయస్థాయి సర్వేలో ప్రతి నలుగురు అమెరికన్లలో ఒకరు ట్రంప్ ప్రతిపాదనను సమర్థిస్తున్నట్లు తేలింది. ట్రంప్ వాదనను 57%మంది వ్యతిరేకించగా, 25%మంది సమర్థించారు. 18% మంది మాత్రం తమకు ఈ అంశం తెలియదని, తమకు ఏ అభిప్రాయమూ లేదని చెప్పారు. ఎన్బీసీ న్యూస్, వాల్ స్ట్రీట్ జర్నల్ కలిసి ఈ సర్వేను నిర్వహించాయి. మరోవైపు రిపబ్లికన్ పార్టీలోని 42 శాతం మంది ఈ వాదనను సమర్థించగా, 36 శాతం మంది వ్యతిరేకించారు. డెమోక్రాట్స్‌లో మూడొంతులమంది వ్యతిరేకిస్తున్నారు. ఇక ముస్లిమ్‌లపై 59 శాతం మంది అమెరికన్లు సానుకూల అభిప్రాయం కలిగి ఉంటే 29 శాతం మంది వ్యతిరేక అభిప్రాయం కలిగి ఉన్నారు.
ఇదిలాఉంటే స్కాట్లాండ్ ప్రభుత్వం ట్రంప్‌కు ఇచ్చిన తమ బిజినెస్ అంబాసిడర్ హోదాను రద్దు చేసుకుంది. స్కాట్లాండ్ లోని ఒక యూనివర్సిటీ ట్రంప్‌కు ఇచ్చిన గౌరవ డాక్టరేట్ రద్దు చేసింది. ఇక ట్రంప్‌ను బ్రిటన్‌లోకి ప్రవేశించనీయొద్దన్న ప్రతిపాదనకు మద్దతుగా 3,58,000మంది సంతకాలు చేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీలో రేసులో ముందున్నారు.