యేడాది కూడా నిండని.. ఓ పసివాడు. తన చుట్టూ ఓ కథ. ఆ పసివాడ్ని పట్టుకోవడానికి ఓ గ్యాంగ్ విశ్వప్రయత్నాలు చేస్తుంటే, వాళ్లందరినీ బురిడి కొట్టిస్తూ సిసింద్రీలా తప్పించుకుంటుంటాడు ఆ బాలుడు. ఈ పాయింట్ తో సినిమా తీయడం నిజంగా కత్తిమీద సామే. అయితే.. ఈ ఫీట్ ని సాధించిన సినిమా `సిసింద్రీ`. అక్కినేని వారసుడు అఖిల్.. పుట్టగానే నటించేసిన సినిమా ఇది. శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ్, టబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలై… నేటికి పాతికేళ్లు.
బేబీస్ డే అవుట్ సినిమాని చూసిన శివ నాగేశ్వరరావు.. ఆ సినిమాని ఓ స్టార్ కిడ్ తో తీస్తే బాగుంటుందన్న ఆలోచనతో అమలని సంప్రదించారు. `మీ అబ్బాయితో సినిమా తీయాలనుకుంటున్నా` అంటూ. అప్పటికి అఖిల్ వయసు 8 నెలలు మాత్రమే. `ఎనిమిది నెలల అబ్బాయితో సినిమా ఏంటి? వేళాకోళమా` అంటూ అమల సీరియస్ గా తీసుకోలేదు. అయితే.. శివ నాగేశ్వరరావు అమల చేతిలో `బేబీస్ డే అవుట్` క్యాసెట్ పెట్టి, ఈ సినిమా చూశాక.. మీ అభిప్రాయం చెప్పండి అంటూ వచ్చేశారు.
ఈ సినిమాని చూసిన అమల, నాగార్జున శివ నాగేశ్వరరావుని కబురంపించారు. `ఐడియా బాగుంది. కానీ. మాదొక్కటే కండీషన్. అఖిల్ కి షూటింగ్ సందర్భంగా చిన్న అసౌకర్యం కలిగినా, చిన్న దెబ్బ తగిలినా.. షూటింగ్ ఆపేస్తా. మళ్లీ సెట్ కి ఎట్టిపరిస్థితుల్లోనూ పంపను. నిర్మాత నష్టపోతాడు. కాబట్టి ఈ సినిమాని మా బ్యానర్ లోనే చేస్తే అఖిల్ ని అప్పగిస్తా..` అంటూ షరతు పెట్టారు. దాంతో అప్పటి వరకూ ఉన్న సానా యాదిరెడ్డి సైడ్ అయిపోయి.. అన్నపూర్ణ బ్యానర్ లో ఈసినిమా మొదలైపోయింది.
హాలీవుడ్ సినిమా బేబీస్ డే అవుట్ సినిమా ఆధారంగా తెరకెక్కినా.. మనదైన మార్పులు కనిపిస్తాయి. మనదైన డ్రామా, రొమాన్స్ జోడించారు దర్శకుడు శివ నాగేశ్వరరావు, రచయిత మరుధూరి రాజా. అయితే.. అప్పటికి ఊహే తెలియని పసివాడితో నటింపజేయడమే పెద్ద టాస్క్. షూటింగ్ జరిగినన్ని రోజులూ… కెమెరా కంటే ముందు అమల ఉండేలా చూసుకుంది టీమ్. అఖిల్ మూడ్ బాగుంటే.. షూటింగ్ ఉండేది, లేదంటే లేదు. అఖిల్ నవ్వుతున్న సన్నివేశాలన్ని ముందుగా రికార్డ్ చేసి పెట్టుకున్నవే. వాటిని సందర్భానికి తగినట్టుగా వాడుకున్నారు. అందుకే అఖిల్ స్మైలీలన్నీ క్లోజ్ షాట్స్లోనే కనిపిస్తాయి.
షూటింగ్ కొన్ని రోజులు బాగానే గడిచింది. ఓరోజు.. అఖిల్ చేతికి చిన్న గాయమైంది. దాంతో.. సెట్లో అంతా కంగారు పడిపోయారు. నాగార్జున చేతిలో దెబ్బలు తప్పవు, షూటింగ్ ఆగిపోవడం ఖాయం అని భయపడ్డారు. అఖిల్ చేతికి గాయమైన వార్త తెలుసుకుని హుటాహుటిన సెట్ కి వచ్చేశాడు నాగ్. సహాయ దర్శకులంతా కంగారు పడుతూ.. నాగ్ ఏం చేసినా సరే, ఎన్ని తిట్టినా సరే, స్వీకరించడానికి సిద్ధపడిపోయారు. కానీ నాగార్జునతో పాటు వచ్చిన ఓ స్నేహితుడు…`ఇదేం పెద్ద దెబ్బ కాదు నాగ్.. చిన్నపిల్లలకు ఇవన్నీ సహజం..` అంటూ వాతావరణాన్ని కూల్ చేయడంతో నాగ్ ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరవాత.. అంతా మామూలే. 70 రోజుల్లో 80 లక్షల బడ్జెట్ తో ఈ సినిమా పూర్తయ్యింది. రాజ్ – కోటీలు విడిపోయాక రాజ్ సోలోగా సంగీతం అందించిన సినిమా ఇది. పాటలు బాగా హిట్టు. తెలుగు చిత్రసీమకు సంబంధించి సిసింద్రీ ఓ ప్రయోగం. అంత చిన్న వయసు పిల్లాడి కథతో.. మరోసారి అలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు కూడా.