సినిమా అనేది మాస్ మీడియం. జనం మెచ్చే సినిమా ఆడుతుంది. జనంలోకి చొచ్చుకుపోయే సినిమాలే నిలబడిపోతాయి. ఎన్నేళ్లయినా ఆ సినిమా గురించో, అందులోని సన్నివేశం గురించో, పాటల గురించో మాట్లాడుకుంటూనే ఉంటాం. అవే మరపురాని చిత్రాలుగా మిగిలిపోతాయి. అలాంటి సినిమాల్లో `ఒరేయ్ రిక్షా` కూడా చేరిపోతుంది. గురు – శిష్యుల కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. దాసరి… తొలిసారి తన శిష్యుడు ఆర్.నారాయణమూర్తిని కథానాయకుడిగా చేసి – తీసిన సినిమా. సంచలన విజయం సాధించడమే కాదు. అప్పట్లో ఇబ్బందుల్లో ఉన్న దాసరి ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టింది. అభ్యుదయ సినిమాల పవర్ ఏమిటో చూపించింది.
దాసరి ఆర్థికంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్న కాలమిది. అభ్యుదయ సినిమాల ట్రెండ్ అప్పుడప్పుడే మొదలైంది. తల్లి సెంటిమెంట్ నేపథ్యంలో ఓ కథ రాసుకుని… టి.కృష్ణతో తీద్దామని ఫిక్సయ్యారు. కానీ కాన్సర్‌తో టి.కృష్ణ అకాలమరణం చెందారు. టి.కృష్ణ దారిలోనే విప్లవ సినిమాలు తీస్తున్న తన శిష్యుడితో ఈసినిమా మొదలెట్టాలని భావించారు. ఇండ్రస్ట్రీలో తాను ఎదగడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన దాసరికి గురు దక్షణగా ఈ సినిమా చేసి పెట్టాడు ఆర్.నారాయణమూర్తి.
వందే మాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. 8 పాటలుంటే అందులో ఆరు గద్దర్ రాశారు. కానీ.. ఒక్క పాటకు కూడా పారితోషికం తీసుకోలేదు. `రక్తంతో నడుపుతాను రిక్షాను` పాట ఈ సినిమా కోసం రాయలేదు. అంతకు ముందే రాసిన ఓ ప్రైవేటు గీతమిది. ఈ సినిమా కోసం వాడుకున్నారు. `నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా..` పాటైతే ఎవర్ గ్రీన్. ఈ పాటే… మహిళా ప్రేక్షకుల్నీ థియేటర్లకు తీసుకొచ్చింది. ఈ పాటకే గద్దర్ కి రచయితగా, వందేమాతరం శ్రీనివాస్ కి గాయకుడిగా నంది అవార్డుల్ని తెచ్చి పెట్టింది. కానీ అప్పట్లో నంది అవార్డు ని తిరస్కరించారు.
దాసరి సొంత సినిమా ఇది. నిర్మాణ సమయంలోనే.. దాసరికి డబ్బుల అవసరమైంది. అందుకే 20 లక్షలు ఇచ్చి.. తూర్పుగోదావరి జిల్లా రైట్స్‌ని కొనుక్కున్నారు ఆర్.నారాయణమూర్తి. సినిమా విజయవంతం అవ్వడంతో తూ.గో నుంచి 60 లక్షలు వచ్చిపడ్డాయి. 1995 నవంబరు 9న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. కాసుల వర్షం కురిపించింది. రూపాయికి 4 రూపాయల లాభం తెచ్చిపెట్టింది. ఓ రకంగా గురువుకి శిష్యుడు ఇచ్చుకున్న గురు దక్షిణ ఈ సినిమా. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితోనే.. `ఒసేయ్ రాములమ్మా` తెరకెక్కించారు. అది కూడా సూపర్ డూపర్ హిట్. ఈ రెండు సినిమాలతో దాసరి మళ్లీ గాడిన పడినట్టైంది.