నాగార్జున కెరీర్లో ఓ మర్చిపోలేని సినిమా… నిన్నే పెళ్లాడతా. తెలుగులో ఆ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. కృష్ణవంశీ మాయాజాలాన్ని 70 ఎం.ఎంలో చూపించిన సినిమా అది. కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చింది. కుర్రాళ్లైతే.. టబు కోసం థియేటర్ల ముందు క్యూ కట్టారు. పాటలంటారా? సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు సడన్ గా నిన్నే పెళ్లాడతా టాపిక్ ఎందుకంటే, ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా పాతికేళ్లు.
కృష్ణవంశీ తొలి సినిమా గులాబీ. దర్శకుడిగా తనకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. దాంతో పాటు ఆఫర్లు కూడా. ఆ వెంటనే నాగార్జున పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. నాగ్ కోసం ఓ కథ రెడీ చేయడం, దానికి నాగ్ ఓకే అనడం కూడా జరిగిపోయాయి. లొకేషన్ల రిక్కీ కోసం కృష్ణవంశీ వైజాగ్ వెళ్లాడు. అయితే అక్కడ గులాబీ గురించిన కొంత ఫీడ్ బ్యాక్ సంపాదించాడు కృష్ణవంశీ. `సినిమా బాగానే ఉంది.. కానీ సెకండాఫ్లో హింస ఎక్కువైంది` అని కొందరంటే, `మీ గురువు రాంగోపాల్ వర్మలా తీశావ్` అని మరికొందరు ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఇవి రెండూ కృష్ణవంశీకి నచ్చలేదు. `రాంగోపాల్ వర్మలా కాదు… నన్ను కృష్ణవంశీలానే చూడాలి` అని ఫిక్సయ్యాడు కృష్ణవంశీ. అందుకే రామూ టచ్ చేయని జోనర్ ని టచ్ చేసి, హిట్టు కొట్టాలనిపించింది. తాను రాసుకున్న కథ మళ్లీ.. రామూ ఫార్మెట్ లోనే ఉండడంతో దాన్ని పక్కన పెట్టేశాడు. (అదే కథ ఆ తరవాత జగపతిబాబుతో సముద్రం పేరుతో తీశాడు కృష్ణవంశీ).
హైదరాబాద్ తిరిగొచ్చే లోగా.. నాగ్ కోసం ఓ ఫ్యామిలీ డ్రామాని అల్లుకున్నాడు. హమ్ ఆప్ కే హై కౌన్, దిల్ వాలే దుల్హనియా లేజాయింగే – లైనులోనే సాగే సినిమా అది. అలాంటి జోనర్లు తెలుగులో చాలా కొత్త. సహజమైన వాతావరణం, డ్రామాలేని సంభాషణలతో ఓ కథ చెప్పాలనుకున్నాడు. దానికి తగ్గట్టేసీన్లు అల్లుకున్నాడు. హైదరాబాద్ లో రాముడొచ్చాడు షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లోనే `నిన్నే పెళ్లాడతా` ఐడియాని కేవలం 3 నిమిషాల్లో చెప్పాడు కృష్ణవంశీ. నాగ్ ఓకే అనేశాడు. ఆ తరవాత పదిహేను రోజుల్లో స్క్రిప్టు పూర్తయ్యింది.
ఈ కథకి శ్రీదేవి లాంటి హీరోయిన్ కావాలి. అయితే నాగ్ పక్కన శ్రీదేవిని ఆల్రెడీ చూసేశారు. అందుకే మరో కొత్త అమ్మాయిని పట్టుకోవాల్సివచ్చింది. దాని కోసం ఏకంగా 70మంది అమ్మాయిల్ని ఆడిషన్ చేశారు. ఏ ఒక్కరూ నచ్చలేదు. చివరికి టబుపై దృష్టి పడింది. టబుని కలవడానికి ముంబై వెళ్లాడు కృష్ణవంశీ. అక్కడ రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు టబుకి కథ మొత్తం చెప్పేశాడు. అలా… రోడ్డుమీద ఓ హీరోయిన్ కి కథ చెప్పిన ఘనత కృష్ణవంశీకే దక్కిందేమో..? టబు ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. టబుని నాగ్ `పండు` అని పిలవడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఆ తరవాత… చాలా మంది కుర్రాళ్లు తమ గాళ్ ఫ్రెండ్లకు పండూ అనేది నిక్ నేమ్ గా పెట్టి పిలవడం మొదలెట్టారు.
ఇక పాటల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ చౌతా పేరు ఈ సినిమాతో మారుమోగిపోయింది. ఎటో వెళ్లిపోయింది మనసు పాట ఎవర్ గ్రీన్ హిట్. నాగార్జునే ఈ సినిమాకి నిర్మాత కాబట్టి.. కృష్ణవంశీ అనుకున్నది అనుకున్నట్టు ఈ సినిమాని తీయగలిగాడు. 1996 అక్టోబరు 4న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ రోజుల్లో బాక్సాఫీసు దగ్గర 12 కోట్ల షేర్ దక్కించుకుంది. అప్పటికి నాగార్జున కెరీర్లో అదే రికార్డు.