హైదరాబాద్: పదిరోజులుగా పార్లమెంటులో రభస చేయడమే తప్ప సాఫీగా జరగకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ సభ్యులపై లోక్ సభ స్పీకర్ కొరడా ఝళిపించారు. 25 మంది సభ్యులను సప్పెండ్ చేశారు. సభను సాఫీగా నడపడానికి ఎంత ప్రయత్నించినా, అఖిల పక్ష సమావేశాలు జరిపినా కాంగ్రెస్ పార్టీ పట్టువీడటం లేదు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, ఇద్దరు ముఖ్యంత్రులు రాజీనామా చేసేవరకూ పార్లమెంటును నడవనిచ్చేది లేదని కాంగ్రెస్ ముందే ప్రకటించింది. ప్రతిరోజూ సభను స్తంభింపచేస్తోంది. ఈరోజు కూడా ఉదయం నుంచి ప్లకార్డులతో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. వెల్ లోకి దూసుకెళ్లారు.
శాంతించాలని, తమతమ సీట్లలో కూర్చోవాలని స్పీకర్ సుమిత్రా మహాజన్, మంత్రులు ఎన్నిసార్లు కోరినా వారు వినలేదు. దీంతో, స్పీకర్ ఆగ్రహించారు. ఇది పద్ధతి కాదంటూ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కు ఉన్నదే 44 మంది. వీరిలో 25 మందిని ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కు గురైన వారిలో తెలంగాణకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఉన్నారు.
ఉదయం ఉభయ సభలూ ప్రారంభమైన తర్వాత అదే వరస. విపక్ష సభ్యుల నిరసనల హోరు. మరోవైపు, రాజ్యసభలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఒక ప్రకటన చేశారు. తనంత తానుగా లలిత్ మోడీ వీసా కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో మాట్లాడలేదని ఆమె స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని చెప్పారు. తాను దురుద్దేశంతో ఏ పనీ చేయలేదని, చట్టవ్యతిరేక, అనైతిక చర్యకు పాల్పడలేదని వివరణ ఇచ్చారు. కానీ దీనితో కాంగ్రెస్ సంతృప్తి చెందలేదు. ఆమె నోటీసు ఇవ్వకుండా చేసిన ప్రకటన చెల్లదని కాంగ్రెస్ కొత్త వాదనను లేవనెత్తింది. చివరకు సభ రేపటికి వాయిదా పడింది.
లోక్ సభలోనూ సభ్యుల గందరగోళం మధ్య సభ సాఫీగా సాగలేదు. చివరకు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. అయితే మిగిలిన కాంగ్రెస్ సభ్యులు సభ సాఫీగా సాగడానికి సహకరిస్తారా లేక వారు కూడా ప్లకార్డుల ప్రదర్శనతో సభను హోరెత్తిస్తారా అనేది చూడాలి.