ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.పాతిక వేల కోట్ల అప్పు గుదిబండగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే అది తీర్చడానికి కాదు. అసలు ఆ అప్పు చేసిన విధానమే లోపభూయిష్టంగా ఉండటం.. సీక్రెట్‌గా ఉంచడం.. వివరాలు ఎవరికీ చెప్పకపోవడం… ఆ అప్పు కోసం తీసుకున్న నిర్ణయాలు నేరపూరితంగా ఉండటం వంటి కారణాల వల్ల.. ప్రభుత్వ పెద్దలతో పాటు నిర్ణయాలు తీసుకున్న అధికారుల్లోనూ టెన్షన్ పుట్టిస్తోంది. దాని గురించి లెక్కలు చెప్పాల్సి వచ్చినప్పుడు.. ఎవరి పుట్టి మునుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు.
కొద్ది రోజుల కిందట ఏపీ ప్రభుత్వం … ఏపీస్టేట్ డెలవప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు మద్యం ఆదాయాన్ని బదిలీ చేసి.. దాన్నే తాకట్టు పెట్టి… బ్యాంకుల నుంచి రూ. పాతిక వేల కోట్ల రుణం తీసుకున్నారు. ఈ రుణంలో ఇంకా ప్రభుత్వానికి మూడున్నర వేల కోట్లు చేరాల్సి ఉంది. అంటే ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం తీసేసుకుంది. మద్యం ఆదాయాన్ని నేరుగా ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాకు మళ్లిస్తారు. అంటే… ప్రజల పన్నులు నేరుగా ప్రత్యేక ఖాతాకు వెళ్తాయి. అక్కడ్నుంచి అప్పులకు తిరిగి చెల్లిస్తారు. ఇలా పదిహేనేళ్లపాటు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఇలా పన్నుల ఆదాయాన్ని ప్రత్యేకంగా మళ్లించడం చట్ట విరుద్ధమని ఇప్పటికే ఆర్థిక నిపుణులు తేల్చారు.
ఇప్పుడు ఈ అప్పులు తీసుకున్న విషయాన్ని ప్రభుత్వం ఏ రికార్డులోనూ చూపించడం లేదు. అంటే బడ్జెట్ పుస్తకాల్లోనూ.. ప్రభుత్వ అప్పుల కేటగిరిలోనూ చూపించడం లేదు. చివరికి కేంద్రం అప్పుల వివరాలు అడిగితే అందులోనూ చెప్పలేదు. ఇలా దాచి పెట్టడం వల్ల భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు వస్తాయన్న ఆందోళన అధికారవర్గాల్లో ఏర్పడుతోంది. ఎందుకంటే.. ఈ అప్పు.. ప్రభఉత్వం చెబుతున్న దాని కంటే అదనంగా చేసింది. ఎఫ్ఆర్బీఏం పరిమితికి మించి చేసిందన్నమాట. ఈ లెక్కలు బయటకు వస్తే… ఏపీ ప్రభుత్వ రుణపరిమితి దాటి మరీ పాతిక వేల కోట్లు అప్పు తీసుకున్నట్లవుతుంది. ఈ తరహా తప్పుడు విధానాలకు పాల్పడినందుకు కేంద్రం అధికారులనే శిక్షించే అవకాశం ఉంది.
పన్నుల ఆదాయాన్ని ఎస్క్రో ఖాతాకు మళ్లి రాజ్యాంగ విరుద్ధం. ఇవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వం … దానికి బాధ్యులయిన అధికారులు బాధ్యత వహించాల్సిందేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశం మెల్లగా పెద్దవుతోంది. ప్రభుత్వ పెద్దల్లోనూ.. ఉన్నతాధికారుల్లోనూ టెన్షన్ ప్రారంభమవుతోంది.