కాంగ్రెస్ పార్టీతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 39 మంది సభ్యులు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే చనిపోవడంతో ఉపఎన్నిక జరగాల్సి ఉంది. బీఆర్ఎస్ 38 మంది సభ్యుల్లో 26 మంది సభ్యులు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే గేట్లు తెరిచామని కాంగ్రెస్ ట్వీట్ చేసిన మరుసటి రోజే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.
వీరిద్దరికీ ఎంపీ టిక్కెట్లు ఖరారు చేస్తున్నందున వెంటనే చేర్చుకున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే.. మూడింట రెండు వంతుల మంది అవుతారని.. విలీనం చేసుకోవచ్చని భావిస్తున్నారు. గతంలో రెండు సార్లు కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు ఎక్కువగా చేరనున్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవడంతో గ్రేటర్ పరిధిలో ఎవరికీ మంత్రి పదవులు కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటే వారికి పదవులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా కొంత మంది ఎమ్మెల్యేలను ఊరిస్తోంది. అయితే ఎన్నికలకు ముందే చేరికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. బీఆర్ఎస్ ను బలహీనం చేయడానికి ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అనుకుంటున్నారు.