హారర్ సినిమా చూస్తూ భయపడటం మామూలే. కానీ ఒక అభ్యర్థి గెలుస్తాడేమో అని భయపడటం, బహుశా ప్రపంచంలో ఇదే మొదటిసారేమో. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతోంది. ముస్లింలు, మెక్సికన్లు, చైనీయులు, భారతీయ ఉద్యోగులకు వ్యతిరేకంగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అతడు అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికాలో ఉండం అని వ్యాఖ్యానించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందట.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ఖరారు కావడం దాదాపు రూఢి అయింది. హిల్లరీ క్లింటన్, డోనాల్ట్ ట్రంప్ మధ్యే పోటీ ఉంటుందని అమెరికన్లు ఓ అంచనాకు వచ్చేశారు. ఒకవేళ ట్రంప్ గెలిస్తే అమెరికాలో ఉండం, వేరే దేశానికి వెళ్లిపోతామని చాలా మంది అంటున్నారు.
దీనిపై అమెరికాలో తాజాగా ఒక సర్వే జరిగింది. ట్రంప్ గెలిస్తే అమెరకా వదిలిపోతామని 28 శాతం మంది చెప్పారట. దాదాపుగా వీరందరూ పొరుగున ఉన్న కెనడా వెళ్లాలని భావిస్తున్నారు. కెనడాకు ఎలా వెళ్లాలని గూగుల్ లో సమాచారం కోసం వెతకడం ఈ మధ్య భారీగా పెరిగిందట. మార్చి 1 నుంచి 350 శాతం పెరిగిందని గూగుల్ ప్రకటించింది.
ట్రంప్ గెలిస్తే కెనడాలో అమెరికన్లు పెద్ద సంఖ్యలో వచ్చి పడతారని అంచనా వేస్తున్నారు. కెనడా ఈమధ్య వలస చట్టాలను కఠినతరం చేసింది. ఇస్తామిక్ తీవ్రవాదాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ కేటగిరీల వారికి అంత సులభంగా ప్రవేశం కల్పించడం లేదు. నవంబర్ లో ట్రంప్ గెలిస్తే, అమెరికా నుంచి లక్షల మంది కెనడా బాట పడితే ఎలా అనేదే ఆసక్తికరం.
అయితే, సర్వే చేసినప్పుడు అతడిమీద ఉన్న కోపాన్ని ఇలా తీర్చుకుని ఉండొచ్చు. నిజంగానే ఇల్లూ వాకిలీ వదులుకుని వేరే దేశానికి వెళ్తారా అనేది ప్రశ్న. సర్వేలో చెప్పడం వేరు, నిజంగా వెళ్లిపోవడం వేరు. కాబట్టి ట్రంప్ గెలిచినా అమెరికన్లు వలసబాట పట్టడం జరగకపోవచ్చని కొందరు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
జీహాదీ ఉగ్రవాదంపై ట్రంప్ విధానాలు భారతీయులకు నచ్చాయి. అందుకే అతడు గెలవాలని హోమాలు కూడా చేశారు. మొత్తానికి ట్రంప్ కొందరికి హారర్ సినిమా పాత్రలా కనిపిస్తుంటే మరి కొందరికి ఆపద్బాంధవుడిలా కనిపిస్తున్నాడు. ఇంతకీ అతడు గెలుస్తాడో లేదో చూద్దాం.