ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ విశాఖ మన్యంలో జరుగుతుందేమో కానీ… ఆర్.ఆర్ ఫైరింగ్ మాత్రం.. విశాఖ క్రికెట్ స్టేడియంలో హోరెత్తింది. విశాఖలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్లు రోహిత్, రాహుల్ విశ్వరూపం ప్రదర్శించారు. చెరో సెంచరీతో కదం తొక్కారు. రోహిత్ శర్మ 138 బంతుల్లో 159 పరుగులు చేశారు. ఇందులో పదిహేడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్… 104 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు మూడు సిక్సులు ఉన్నాయి. వన్డేల్లో రోహిత్ శర్మకు 28వ సెంచరీ. హాఫ్ సెంచరీ సాధించడానికి 67 బంతులు తీసుకున్న రోహిత్ శర్మ… ఆ తర్వాత హాఫ్ సెంచరీని కేవలం 40 బంతుల్లో పూర్తి చేశాడు. ఒక ఏడాదిలో 10 సెంచరీలు సాధించిన మొట్టమొదటి ఓపెనర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరిస్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఆ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో 5 సెంచరీలు కొట్టాడు. ఆర్..ఆర్ ద్వయం ఇద్దరూ తొలి వికెట్‌కు 227 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ..తొలి బంతికే గోల్డెన్ డక్ అయ్యాడు. కానీ శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ బ్యాట్ ఝుళిపించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. 388 పరుగుల లక్ష్యాన్ని భారత్ వెస్టిండీస్‌కు ఇచ్చింది. అయితే.. ఈ భారీ స్కోరు చూసి..విండీస్‌కు ముందుగానే… గుండెలు జారిపోయాయి.
హోప్, పూరన్ ఆశలు రేపే ప్రయత్నం చేశారు కానీ.. ఏ దశలోనూ… విండీస్ గట్టిపోటీ ఇవ్వలేదు. 33వ ఓవర్లో కులదీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్స్ తీయడంతో.. వెస్టిండీస్ కు ఘోరపరాజయం ఖాయమైపోయింది. తొలి వన్డేలో టీమిండియా ఓ మాదిరి భారీస్కోర్ చేసినా…వెస్టిండీస్ చాలా తేలిగ్గా.. అధిగమించింది. దాంతో.. మ్యాచ్ రసవరత్తరంగా జరుగుతుందనుకున్నారు. కానీ అచ్చి వచ్చిన విశాఖ.. టీమిండియాకు మరో విజయాన్ని అందించింది.