‘బాహుబలి’ని రాజమౌళి తెలుగు సినిమాగా చూడలేదు. భారతీయ సినిమాగా చూశారు. అందుకని, పబ్లిసిటీ విషయంలో అన్ని భాషలకూ సమ ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగులో మీడియా సంస్థలు అన్నిటినీ పిలవకుండా… అగ్ర సంస్థలకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇవ్వడంపై, హిందీ మీడియా ప్రముఖులు కొందర్ని సెట్స్‌కు తీసుకువెళ్లి మరీ ఇంటర్వ్యూలు ఇవ్వడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి పబ్లిసిటీ స్ట్రాటజీ రాజమౌళిది. ఇంటర్వ్యూలు సంగతి పక్కన పెడితే… హైదరాబాద్‌లో తెలుగు ఆడియో ఫంక్షన్ చేసిన రాజమౌళి, చెన్నైలో తమిళ ఆడియో ఫంక్షన్ చేశారు. ముంబయ్‌లో ప్రెస్మీట్స్ పెట్టారు. కేరళ వెళ్లారు. యూనిట్ అంతా సినిమా విడుదలకు ముందు దేశంలో ప్రధాన నగరాలు తిరిగారు.
‘బాహుబలి’ స్థాయి సినిమాగా పేర్కొంటున్న, అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీస్తున్న రజనీకాంత్ ‘2.ఓ’ పబ్లిసిటీ విషయంలో చాలా వెనుక బడింది. చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్‌కి తెలుగు నుంచి కొంతమంది మీడియా ప్రతినిధులను తీసుకువెళ్లారు. అంతే… తరవాత తెలుగులో పబ్లిసిటీ వ్యవహారాలను పట్టించుకోవడం మానేశారు. ‘2.ఓ’ 3డీలో తీసిన సినిమా. 4డీ ఆడియో టెక్నాలజీ ఉపయోగించిన తొలి సినిమా. 2డీలో షూటింగ్ చేసి, 3డీలోకి మార్చకుండా నేరుగా 3డీలో షూటింగ్ చేసిన సినిమా. ఇటువంటి విశిష్టతలెన్నో సినిమాలో ఉన్నాయి. వాటి గురించి చెన్నై ఆడియోలో యూనిట్ తమిళంలో మాట్లాడిన మాటలనే తెలుగు మీడియాకు విడుదల చేస్తున్నారు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ కోసం అమితాబ్ బచ్చన్, ఆమిర్‌ఖాన్ తెలుగులో మాట్లాడిన స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఎప్పటినుంచో తెలుగు ప్రేక్షకులు రజనీకాంత్, శంకర్ సినిమాలను ఆదరిస్తున్నారు. తెలుగులో మాట్లాడి ఇక్కడ అభిమానుల కోసం చిన్న చిన్న వీడియోలు విడుదల చేయలేరా?
ఇక, ఇంటర్వ్యూల సంగతి చెప్పనవసరం లేదు. తమిళంలో జీ ఛానల్‌కి రజనీకాంత్ ఇంటర్వ్యూ ఇచ్చారు. హిందీలో ఓ ఛానల్‌కి శంకర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగు మీడియా అంటే చిన్న చూపు ఎందుకో? ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ప్రచార కార్యక్రమాలకు దూరంగా వుండే నయనతార, ‘అనామిక’ కోసం ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు. లేడీ ఓరియెంటెడ్ సినిమా, అందులోనూ తనే ప్రధాన పాత్రధారి కనుక ప్రచార బాధ్యతను అర్థం చేసుకున్నారు. ‘2.ఓ’ బృందానికి తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వాలనే ఆలోచన లేదేమో? రజనీకాంత్ అందుబాటులో లేకపోతే, ఒకవేళ ఆయన ఆరోగ్యం సహకరించకపోతే… శంకర్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేరా? తమిళ, ఇంగ్లిష్ ఇంటర్వ్యూలు మారుమూల ప్రాంతాల ప్రజలకు, మెజారిటీ ప్రేక్షకులకు చేరువ అవుతాయో? లేదో? ‘2.ఓ’ బృందానికి తెలియనిది కాదు. మరి, ఎందుకు తెలుగు మీడియాలో ప్రచారం గురించి పట్టించుకోవడం లేదో??