చట్టబద్ధమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే.. రాజధానిని తరలిస్తామని కోర్టుకు చెప్పిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. శాసనమండలిలో ఉండిపోయిన బిల్లులు.. ఆమోదం పొందినట్లుగానే భావించి.. చట్ట ముద్ర వేయాలని కోరుతూ.. గవర్నర్ వద్దకు పంపబోతున్నారు. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను బడ్జెట్ సమావేశాల్లో ఏపీ సర్కార్ మళ్లీ ప్రవేశ పెట్టింది. శాసనసభలో ఆమోదం పొందాయి. వాటిని శాసనమండలికి పంపారు. అయితే.. అక్కడ గందరగోళం ఏర్పడటంతో నిరవధికంగా వాయిదా పడింది. ప్రభుత్వం కూడా అదే కోరుకుందన్న ప్రచారం జరిగింది. బిల్లులు శాసనమండలిలో ఏవీ ఆమోదం పొందకపోవడతో.. మనీ బిల్లు అయిన బడ్జెట్ కు 14రోజుల తర్వాత ఆమోదం లభించింది. మనీ బిల్లులు కాని… మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు కోసం మాత్రం.. నెల రోజులు ఆగాల్సి ఉంది. ఇప్పుడు ఆ బిల్లులు శాసనమండలిలో ప్రవేశ పెట్టి నెల రోజులు అయింది. అందువల్ల.. వాటిని ఆమోదించినట్లుగానే పరిగణించాలంటూ… ప్రభుత్వం.. గవర్నర్ వద్దకు పంపితే.. ఆయన సంతకం చేస్తారు. గవర్నర్ సంతకం చేస్తే ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే. ప్రభుత్వం.. మూడు రాజధానుల ఏర్పాటుకు అవసరమైన చట్టబద్ధమైన ప్రక్రియ పూర్తి చేసినట్లే.
అయితే.. ఈ బిల్లులపై అనేక న్యాయ, చట్ట పరమైన వివాదాలు ఉన్నాయి. మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ బిల్లులు రెండో సారి ప్రవేశ పెట్టారు. మొదటి సారి ప్రవేశ పెట్టిన వాటిని శాసనమమండలి.. తిరస్కరించడమో.. ఆమోదించడమో చేయలేదు. సెలక్ట్ కమిటీకి పంపింది. ఈ విషయం ప్రభుత్వం హైకోర్టుకు కూడా చెప్పింది. కానీ సెలక్ట్ కమిటీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఇప్పుడు ఆ బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లలేదని.. ప్రభుత్వం వాదిస్తోంది. అందుకే రెండో సారి బిల్లులు పెట్టామని చెబుతోంది. డీమ్డ్ టు బి పాస్ నిబంధన వాడుకుని.. ముందుకెళ్తోంది.
అయితే.. విభజన చట్టంలో మూడు రాజధానుల ప్రస్తావన లేదు. ఇప్పుడు ఏపీకికొత్తగా మూడు రాజధానులు పెట్టుకోవాలంటే.. కేంద్రం రూపొందించిన విభజన చట్టాన్ని మార్చాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. జంధ్యాల రవిశంకర్ లాంటి వాళ్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర చట్టాన్ని మార్చే అధికారం రాష్ట్రానికి ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ దీనిపై ఎలా వ్యవహరిస్తారన్నది కూడా కీలకమే. కేంద్రచట్టానికి సంబంధించింది కాబట్టి.. రాష్ట్రపతికి పంపాలని కొంత మంది అంటున్నారు. మొత్తానికి.. సీఆర్డీఏ చట్టం రద్దు.. మూడు రాజధానుల బిల్లులు మరోసారి కలకలానికి కారణం అవడం ఖాయంగా కనిపిస్తోంది.