దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులున్నాయి..కాబట్టి.. ఏపీకి కూడా మూడు రాజధానుల అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ ఏపీ సీఎంకు తెలిసి కూడా… తెలియనట్లుగా మాట్లాడారో.. నిజంగానే తెలియదో కానీ.. సౌతాఫ్రికాలో మూడు రాజధానులు ఉండటం వల్ల అభివృద్ధి కుంటుపడిందని.. ఒక్క రాజధానికే పరిమితమైతే బాగుంటుందనే చర్చ… చాలా ఉద్ధృతంగా సాగుతోంది. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులను చారిత్రక కారణాలతో ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత బ్రిటిష్ కాలనీలైన కేప్, నాటల్; బోయర్ రిపబ్లిక్లు అయిన ట్రాన్స్వాల్, ఆరంజ్ ఫ్రీ స్టేట్ అంటే నాలుగు భూభాగాలు కలసి 1910లో యూనియన్ ఆఫ్ సౌతాఫ్రికా ఏర్పడింది.
నూతన రాజధాని నగరంపై పెద్ద వివాదమే సాగింది. అనేక చర్చలు, వాదోపవాదనల తరువాత అధికారాన్ని దేశ వ్యాప్తంగా పంచడానికి ఒక రాజీ ఫార్ములాను రూపొదించారు. దాని ప్రకారమే మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చాయి. ప్రస్తుతం రాజధానులుగా ఉన్న ప్రిటోరియాతో పాటు, బ్లోమ్ఫొంటెన్లు గతంలో కూడా రాజధానులే. దక్షిణాఫ్రికా ఆవిర్భావానికి ముందు బ్లోమ్ఫొంటెన్ ఆరేంజ్ ఫ్రీ అనే ప్రాంతానికి రాజధాని. ట్రాన్స్వాల్ అనే ప్రాంతానికి ప్రిటోరియా రాజధాని. అవన్నీ కలిసి దక్షిణాఫ్రికాగా ఏర్పడ్డాయి. విలీన ఫార్ములాలో భాగంగా వాటిని రాజధానులుగా కొనసాగిస్తున్నారు. అయితే.. బహుళ రాజధానులు ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్నాయంటూ.. దక్షిణాఫ్రికా ప్రభుత్వాలు.. ఎప్పుడూ చెబుతూనే ఉంటాయి. మూడు రాజధానులు తీవ్ర నష్టానికి ఎలా కారణమవుతున్నాయో వివరిస్తూ… అంతర్జాతీయ మీడియాలోనూ అనేక కథనాలు వచ్చాయి. అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న సౌతాఫ్రికా… బహుళ రాజధానుల వల్ల కుప్పకూలే పరిస్థితులు వచ్చాయని విశ్లేషించాయి.
మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా.. ఈ విషయంలో… ప్రజల సెంటిమెట్ల కన్నా.. దేశ ఆర్థిక వ్యవస్థే ముఖ్యమని.. చర్చ కూడా ప్రారంభించారు. విస్తీర్ణం పరంగా చూస్తే.. దక్షిణాఫ్రికాలో ఏపీ ఉండేది.. ఐదారు శాతం మాత్రమే. దక్షిణాఫ్రికా విస్తీర్ణం 12,20,813 చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 1,60,205 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అప్పట్లో.. దక్షిణాఫ్రికా ఏర్పాటు కోసం… సమైక్యంగా ఉంచేందుకు మూడు రాజధానుల్ని ప్రతిపాదించగా.. ఇప్పుడు… రాజకీయాల కోసం… ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ఏపీ రాజకీయ నేతలు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు.