ఖచ్చితంగా ఐదు వందల రోజులయింది. మూడు రాజధానులను పెట్టబోతున్నానని ఏపీ సీఎం జగన్ ప్రకటించి ఐదు వందల రోజలయింది. కానీ ఇంత వరకూ ఒక్క అడుగు ముందుకేయలేకపోయారు. అలాగే ఆయన నిర్ణయంతో రోడ్డెక్కిన రైతులు ఐదు వందల రోజులుగా రోడ్డు మీదే ఉన్నారు. ఈ ఐదు వందల రోజులను వెనక్కి తిరిగి చూసుకుంటే కనిపించేది ప్రభుత్వ నిర్వాకం.. రోడ్డునపడ్డ రైతులు.. మాత్రమే కాదు.. ఛిద్రమైపోయిన రాష్ట్ర భవిష్యత్ కూడా..!
ఐదు వందల రోజుల కిందట.. సర్కార్ పెట్టిన అమరావతి మంట..!
ఐదు వందల రోజుల కిందట…ఓ డిసెంబర్ 17న సీఎం అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయని… అందుకే దక్షిణాఫ్రికాను ఫాలో అయిపోతున్నామని ప్రకటించేశారు. కర్నూలును న్యాయరాజధానిగా డిక్లేర్ చేసేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. అమరావతిని శాశసన రాజధానిగా చెప్పుకొచ్చారు. అలా ప్రకటించడం ఆలస్యం.. ఇలా వెళ్లిపోదామని అనుకున్నారు. ఎప్పటికప్పుడు ముహుర్తాలు ఖరారు చేసుకున్నారు. కానీ.. వెళ్లలేకపోయారు. మధ్యలో వచ్చిన పాలనాపరమైన.. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించడానికి… అసలు రాజధాని ఎక్కడ ఉండాలన్నది సమస్యే కాదని.. ఎక్కడ సీఎం ఉంటే అదే రాజధాని అనే వాదన తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకూ సీఎం విశాఖ వెళ్లలేకపోయారు. రాజధాని వెళ్లలేకపోయింది. కానీ ఒక్క నిర్ణయంతో … ఏపీ రాత తలకిందలయింది. ఉదారంగా భూములిచ్చిన రైతులు రోడ్డున పడ్డారు. ఏపీకి రాజధాని ఏదో తెలియని పరిస్థితి ఇప్పటికీ వెంటాడుతోంది. ఆర్థిక రథచక్రం ఆగిపోయింది. మొత్తంగా ఐదు వందల రోజుల కిందటితో పోలిస్తే… ఏపీ ఇప్పుడు అయోమయంలో ఉండిపోయింది.
అధికార పార్టీ చేసిన అడ్డగోలు మోసం .. అమరావతి..!
ఐదు వందల రోజులుగా అమరావతిని గతంలో వైసీపీ సమర్థించింది. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో జగన్ మద్దతు తెలిపారు. ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలంతా అమరావతే రాజధాని అని.. అన్ని ప్రాంతాల్లో చెప్పారు. అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు..ఎన్నికలకు ముందు మాట్లాడిన తీరు.. ప్రజల కళ్ల ముందే ఉంది. అమరావతే రాజధాని అని కుండబద్దలు కొట్టిన నేతలు.. ఇప్పుడు దానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వీటిని చూసి ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. సీఎం జగన్ స్వయంగా అమరావతికి మద్దతు తెలిపిన వీడియోలు..ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సోషల్ మీడియాలో ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నాయి. చెప్పిన మాటని ఆచరించని రాజకీయనాయకుడు పదవుల నుంచి వెళ్లిపోయేలా.. మంచి రాజకీయ వ్యవస్థను తెస్తానని ఆయన చెప్పే డైలాగులు కొసమెరుపులా .. సోషల్ మీడియాలో మెరుస్తూ ఉన్నాయి..మాట తప్పని మడమ తిప్పని నేతల బండారాన్ని బయట పెడుతూనే ఉన్నాయి. ఇంత నిస్సిగ్గుగా అమరావతిని చంపేసేందుకు ఎందుకు వారు నాలిక మడతేశారో వాళ్లకే తెలియాలి.
రెండేళ్ల నుంచి నిక్షేపంలా అమరావతి నుంచి పాలన..!
గత ప్రభుత్వానికి అమరావతి మాస్టర్ ప్లాన్ ఫైనల్ అవ్వడానికి, రైతులనుండి భూమి సేకరించడానికి రెండు సంవత్సరాలు పడితే అంతలో కొందరు వైసిపి మద్దతు దారులు రాజధానిపై గ్రీన్ ట్రిబ్యూనల్ కు వెళ్ళారు. దీంతో సమగ్రమయిన ఎత్తిపోతల పధకాన్ని కొండవీటి వాగుకు నిర్మించాకే రాజధాని విషయంలో ముందుకు వెళ్ళాలని హరిత ట్రిబ్యూనల్ ఆదేశించడంతో మరో రెండు సంవత్సరాలు పాటు రాజధాని నిర్మాణం నత్తనడకన సాగింది. ఎత్తిపోతల పధకాన్ని నిర్మించిన తర్వాత రాజధాని పనులు వేగం పుంజుకున్నాయి. పలు బహుళ అంతస్ధుల భవనాలు నిర్మాణం వేగంగా సాగింది. 8నుండి 10 నెలలు కాలంలోనే చాలా భవనాలు 80నుండ 90 శాతం పూర్తయ్యాయి. అసెంబ్లీ, సచివాలయం దగ్గర్నుంచి ఇప్పుడు అమరావతి పరిధిలోని ఏ గ్రామానికి వెళ్లినా అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుంది. ప్రైవేటు వర్సిటీలు …ప్రభుత్వ భవనాలు… పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఉంటాయి. రెండేళ్ల నుంచి అక్కడి నుంచి నిక్షేపంలా పాలన సాగుతోంది.
రైతులకెలా న్యాయం చేస్తారు..!?
రాజధాని తరలింపు అనేది వైసీపీ లేదా సీఎం జగన్ సొంత వ్యవహారం కాదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి.. తాను ఏం చేయాలనుకుంటే అది చేస్తారు… దానికి ప్రజలకోసమే అన్న ముద్ర వేస్తారు. కానీ.. ఆ ప్రజల కోసం.. ఇతరులకు అన్యాయం చేసే హక్కు ముఖ్యమంత్రికి అయినా లేదు. అందుకే.. రైతులకు న్యాయం చేయాల్సి ఉంది. రాజధాని తరలించేసి.. అక్కడ రోడ్లేసి.. ప్లాట్లేసి ఇస్తామంటే ఒప్పందం ఉల్లంఘన అవుతుంది. అప్పుడు రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. సీఆర్డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందంలో 9.14 ఫాంలోని 18వ షరతు ప్రకారం.. ప్రభుత్వం ఏ షరతునైనా ఉల్లంఘిస్తే 2013 చట్టం కింద పరిహారమివ్వాలని పేర్కొన్నారు. భూసమీకరణ విధానంలో భూములు తీసుకున్నప్పుడు రైతులు మొదటి పార్టీగా, ప్రభుత్వం రెండోపార్టీగా పేర్కొంటూ ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలోని 18వ షరతులో…షెడ్యూలు ఆస్తిపై అభివృద్ధి పనులు నిలుపుదల చేయాలని మొదటి పార్టీ కోరరాదు. అదేవిధంగా రెండో పార్టీ.. అంటే ప్రభుత్వం కనుక ఒప్పందం ఉల్లంఘిస్తే నష్టపరిహారం.. చట్టప్రకారం అర్హమైన నష్టపరిహారాలు పొందుటకు అర్హులై ఉన్నారు..అని పేర్కొన్నారు. దీనిప్రకారం రాజధానిని తరలించి.. రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. న్యాయపరంగా ఒప్పందాల్ని ఉల్లంఘిస్తే… 2013 భూసేకరణ చట్టం ప్రకారం .. 72 వేల కోట్ల రూపాయల మేర పరిహారం చెల్లించాల్సి వస్తుంది. లెక్కన రైతుల నుంచి సమీకరించిన 33వేల ఎకరాలకు సుమారు 72వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
అమరావతి గొప్ప ఆర్థిక నమూనా..!
అమరావతిలో ఆర్థిక నిపుణలు ఓ గొప్ప ఆర్థిక నమూనాను చూశారు. పట్టణీకరణకు ఓ అద్భుతమైన దిక్సూచీగా మారబోతోందని అంచనా వేశారు. 33వేల ఎకరాలు సమీకరించిన విధానం.. ఆ ప్రాజెక్ట్ పై.. దేశవ్యాప్తంగా విశ్వాసం పెరగడానికి కారణం అయింది. ఆ ప్రాజెక్ట్‌కు ఎంత క్రేజ్ వచ్చిందంటే.. రెండు వేల కోట్ల రుణం కోసం..సీఆర్డీఏ బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్ట్ అయితే.. ఆ మొత్తం నిమిషాల్లోనే వచ్చింది. అమరావతి మాత్రం.. జాతీయ, అంతర్జాతీయంగా.. ఓ అద్భుతమైన సిటీ.. ఆంధ్రప్రదేశ్‌లో రూపుదిద్దుకోబోతోందన్న అంచనాకు వచ్చారు. అమరావతి మోడల్ సక్సెస్ అయితే.. పట్టణీకరణలో కొత్త చరిత్ర ప్రారంభమవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఎందుకంటే.. వరల్డ్ క్లాస్ సిటీ.. సెల్ఫ్ ఫైనాన్షింగ్ ద్వారా పూర్తి కావడం అంటే.. ఓ గొప్ప మోడల్ దొరికినట్లే. అందుకే..జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అమరావతికి ప్రాధాన్యం తగ్గించడాన్ని జాతీయ మీడియా .. మొదటి నుంచి విమర్శిస్తోంది. ప్రఖ్యాత ఆర్థికవేత్తలు.. బిజినెస్ మీడియాకూడా.. తప్పు పట్టింది. మొదటి బడ్జెట్లో అమరావతికి కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే ఇచ్చిన వైనం.. ఆ తర్వాత సింగపూర్ తో ఒప్పందం రద్దు చేసుకోవడం వంటి ఆంశాలపై.. బిజినెస్ నిపుణులు తీవ్రంగా స్పందించారు. పట్టణీకరణలో .. అమరావతి అనేది ఓ రోల్ మోడల్ లాంటిదని.. దాన్ని చంపవద్దని ఏపీ సీఎంకు ఎకనామిక్ టైమ్స సూచించింది. మోహన్ దాస్ పాయ్ లాంటి పారిశ్రామికవేత్తలు.. శేఖర్ గుప్తా లాంటి జర్నలిజం దిగ్గజాలు కూడా..అమరావతిపై జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. కానీ సీఎం జగన్ తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అని డిసైడ్ అయిపోయారు.
రైతుల పోరాటం అనన్య సామాన్యం..!
వారు రాజధాని కోసం భూములిచ్చారు. తమ భూముల్లో రాజధాని వస్తే తమ బతుకులు బాగుపడతాయని అనుకున్నారు. కానీ వారు బాగుడపతారని…. వారంతా కమ్మోళ్లని… ఇతర పార్టీలు పర్చారం చేసి… రాజధానిపై వ్యతిరేకత పెంచాయి. నిజానికి భూములిచ్చినవారిలో దళితులు ఎక్కువ. జగన్ సర్కార్… నిర్ణయంతో తమ జీవితాల్ని తలకిందులు చేశారని వారు రోడ్డెక్కారు. అమరావతి ఉద్యమం అనేక ఎత్తు పల్లాలు, కష్టనష్టాలు, బాధలు, రైతుల ఆవేదనలతో ఐదు వందల రోజులుగా సాగుతోంది. ప్రభుత్వం వ్యవహరిచిన తీరు, న్యాయస్థానాల నుంచి లభించిన ఊరటతో అమరావతి ఉద్యమం మైలురాయిని అందుకున్నారు. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు. అమరావతిని ప్రకటించినప్పుడు దశాబ్దాల రాజధాని కల తీరుతుందంటే ఆంధ్రులు మురిశారు. అమరావతి నిర్మాణంలో తలో చెయ్యి వేశారు. నల్లటి నేలపై పచ్చని సేద్యం చేసే రైతన్నలు సహజంగానే ఈ యజ్ఞంలో ముందున్నారు. కలల నగరం సాకారమవుతుందన్న వేళ వచ్చిపడిన ఎన్నికలతో అమరావతి తలరాత మారిపోయింది. అయితే… ఉద్యమం మాత్రం ఆశలు రేపుతోంది. దేవతల రాజధాని అమరావతిని ఎవరూ కదిలించలేరన్న నమ్మకం బలపడుతోంది.