సాహోపై సమీక్షలు, విశ్లేషణలూ అయిపోయాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి తప్పులు చేశారన్నది బయటకు వస్తోంది. ఈ సినిమాకి దాదాపు 350 కోట్ల ఖర్చు పెట్టినట్టు చిత్రబృందం చెబుతోంది. సినిమా చూస్తే అంతైందా? అనే అనుమానం రాక మానదు. యాక్షన్ సన్నివేశాలకు భారీగా ఖర్చు పెట్టిన సంగతి నిజమే. దాంతో పాటు దుబారా ఖర్చు కూడా ఎక్కువే అయ్యింది. ఈ సినిమాలో లవ్ ట్రాక్‌ని బాలీవుడ్ రైటర్ల చేత రాయించాడట సుజిత్. శ్రద్దాకపూర్ – ప్రభాస్‌ల మధ్య ట్రాక్ రాయడానికి బాలీవుడ్ నుంచి వచ్చిన రైటర్లు దాదాపు 45 రోజులు కష్టపడి కొన్ని సీన్లు తయారు చేసి ఇచ్చారు. అయితే అందులో సుజిత్ కొన్నేవాడుకున్నాడట. ఈ ట్రాక్ కోసం బాలీవుడ్ రైటర్లకు దాదాపు 3 కోట్లు ఇచ్చారని, పార్క్ హయత్‌లో ఆ 45 రోజులూ సూట్ రూమ్‌లోనే వాళ్లు బస చేశారని తెలుస్తోంది. ఆ ఖర్చులూ నిర్మాతలవే. మరి మూడు కోట్లతో ఖర్చు పెట్టి తీసిన ఆ సీన్లు సినిమాకి ఎంత పనికొచ్చాయో అర్థమవుతూనే ఉంది. ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలాంటి దుబారాలు సాహో విషయంలో చాలా జరిగాయి. అవన్నీ ఇప్పుడు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి.