జనసేన అద్యక్షుడు, నటుడు పవన్ కళ్యాణ్ ఆలోచనలూ ప్రకటనలూ కొంచెం తమాషాగా వుంటాయి. అదే సమయంలో ఆయనకు ఆలోచనే లేదని అనుకోవడం కూడా పొరబాటే. ఉద్దేశపూర్వకంగానే పవన్ కొంత వింతగానూ కొంత అస్పష్టంగానూ మాట్లాడుతుంటారు. తద్వారా మార్జిన్ అట్టిపెట్టుకుంటారు. తాజాగా ఆయన జనసైనికుల రిక్రూట్మెంట్ కోసం ప్రకటన చేశారు. తను సభ జరిపి ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్న అనంతపురంను ఇందుకోసం ఎంచుకున్నారు. అక్కడ 21 నుంచి జనసైనికుల ఎంపిక మొదలవుతుందంటున్నారు. వారికి మూడు రోజులు పరీక్షలు వుంటాయన్న సూచన వీటిలో కొత్తది.గతంలో రాజకీయ పార్టీలేవైనా ఈ తరహా పరీక్షలు పెట్టాయో లేదో తెలియదు. పవన్ పెట్టే పరీక్ష ఎలాటిదో కూడా చూడాల్సిందే. ఏమైనా ఏవో కొలబద్దలతో తీసుకుంటామన్న సంకేతం ఇవ్వడానికి ఈ మార్గం ఎంచుకున్నట్టున్నారు. ఈ ఎంచుకునేవారిని పార్టీలో ఏవైనా పదవులకు లేదా నాయకత్వాలకు తీసుకుంటారా అన్నది కూడా చూడాల్సిందే. తమకు చెడ్డపేరు తెచ్చేవారు జొరబడకుండా జాగ్రత్త తీసుకోవాలని అంతా పారదర్శకంగా జరగాలని పవన్ చెబుతున్నారు. అవన్నీ ఎవరు చూసుకోవాలి? తను తన సలహాదారులే కదా!