దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఓ సరికొత్త ఆలోచనతో రాబోతున్నారు. ముగ్గురు దర్శకులు, ముగ్గురు కథానాయికలతో ఓ సినిమా రూపొందించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. కె.రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. ఆ ముగ్గరు దర్శకులు… కేవలం నటనకు పరిమితం అవుతారు. మరో దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఆ ముగ్గురు దర్శకులు, ఆ ముగ్గురు కథానాయికలు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. దర్శకులు నటులుగా మారడం సహజమే. అయితే.. ముగ్గురు దర్శకులు ఒకేసారి నటులుగా మారి, ఒకే సినిమాలో కనిపించడం విశేషమే. మరి ఆ దర్శకులు ఎవరో, ఈ సినిమాని దర్శకత్వం వహించే ఆ నాలుగో దర్శకుడు ఎవరో రాఘవేంద్రరావునే చెప్పాలి. గురువారం దర్శకేంద్రుడి జన్మదినం. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఆ ప్రకటనలోనైనా దర్శకులు, కథానాయికల వివరాలు తెలుస్తాయేమో చూడాలి.