‘ఫక్ ఆల్ రివ్యూస్’ అంటూ ఓ పోస్టర్ విడుదల చేసి – తన సినిమాలపై వచ్చిన రివ్యూలపై అక్కసు కురిపిద్దామనుకున్నాడు ఇంద్రసేన. ఈ కుర్ర దర్శకుడు తీసిన `వీర భోగ వసంత రాయులు` ఈ శుక్రవారం విడుదలై డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. `ఇదేం సినిమారా బాబోయ్` అంటూ సినీ విశ్లేషకులు తలలు పట్టుకున్నారు. ప్రేక్షకుల సంగతి సరే సరి. రివ్యూలు కూడా ఈ సినిమాని చీల్చి చెండాడాయి. దాంతో సదరు దర్శకుడు హర్టయ్యాడు. `ఫక్ ఆల్ రివ్యూస్` అంటూ ఓ పోస్టర్ విడుదల చేశాడు.
దాంతో ఇందులో నటించిన ముగ్గురు హీరోలూ అవాక్కయ్యారు. శ్రీవిష్ణు, నారా రోహిత్, సుధీర్ బాబు… సదరు దర్శకుడిపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. `ఇలాంటి వివాదాస్పద స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి కదా. నీ స్టేట్మెంట్ అనుకోరు.. మమ్మల్ని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయకు` అని ముగ్గురూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. నిజానికి ఈ సినిమా విడుదలకుముందే సదరు దర్శకుడికీ నిర్మాతలకూ మధ్య గ్యాప్ వచ్చేసిందని, ప్రచారం చేసుకోవడానికి కూడా నిర్మాతలు సుముఖత చూపించలేదని తెలుస్తోంది. కనీసం ఈ సినిమా విడుదల రోజున ప్రెస్ షో వేయలేదంటేనే నిర్మాతల పరిస్థితి ఎలా అయిపోయిందో అర్థం చేసుకోవొచ్చు. హీరోలు కూడా దర్శక నిర్మాతలతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించారని, చాలా రోజుల నుంచే ఇంద్రసేనని దూరంగా పెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
తాజాగా ఇంద్రసేన చేసిన వ్యాఖ్యల్ని చూసి ముగ్గురు హీరోలూ షాక్‌కి గురయ్యార్ట. శ్రీవిష్ణు అయితే దిద్దుబాటు చర్యలకు దిగిపోయాడు కూడా. ఆ దర్శకుడితో నేను టచ్‌లో లేను.. రివ్యూలంటే నాకెప్పుడూ గౌరవమే అంటూ ట్వీట్ చేశాడు శ్రీవిష్ణు. మిగిలిన హీరోలిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి.