ఈరోజు ఉదయం ఒక టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఒక కొత్త వార్త ఇచ్చారు. చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తామని, తమ పార్టీలో చేరమని గత మూడు నాలుగు నెలలుగా ప్రతిపాదనలు వస్తున్నాయని అద్దేపల్లి శ్రీధర్ అన్నారు. బిజెపితో పాటు తెలుగుదేశం వైఎస్సార్సీపీ పార్టీల నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయని అద్దేపల్లి శ్రీధర్ పేర్కొన్నారు. శ్రీధర్ వ్యాఖ్యలు డిబేట్ లో పాల్గొన్న వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి.
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు రాజకీయాల్లో ప్రవేశించి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009 ఎన్నికల్లో 17 శాతం ఓట్లు 18 సీట్లు సాధించిన ఆ పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి తన రాజ్యసభ కాలపరిమితి ముగిసిన తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. అయితే చిరంజీవి గనుక యాక్టివ్ కావాలనుకుంటే చేర్చుకోవడానికి పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అద్దేపల్లి వ్యాఖ్యల ద్వారా అర్ధం అవుతోంది.
అయితే ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ చిరంజీవిని ఏదో రకంగా తమ పార్టీలో గనక చేర్చుకోగలిగితే కచ్చితంగా ఆ ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని ఆయా పార్టీలు భావించడంలో తప్పులేదు. కానీ చిరంజీవి ఆయా పార్టీల ప్రతిపాదనలను తోసిపుచ్చారని అద్దేపల్లి శ్రీధర్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెగా అభిమానులంతా జనసేన పార్టీ వైపు పోలరైజ్ అవుతున్న తరుణంలో చిరంజీవి మరే ఇతర పార్టీ లోనూ చేరే అవకాశాలు కనిపించడం లేదు. జనసేన లో ఆయన నేరుగా చేరకపోయినా, కాంగ్రెస్ తో సహా ఏ రాజకీయ పార్టీ కి మద్దతు ఇవ్వకుండా సైలెంట్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.