వైరస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ వెనుకడుగులు వేస్తూనే ఉంది. రోజులు అరవైకి తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నయి. గత ఇరవై నాలుగు గంటల్లోనూ అంతే నమోదయ్యాయి. అయితే.. ఈ సారి అతి పెద్ద షాకింగ్ న్యూస్… శ్రీకాకుళం జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు నమోదవడం. వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభమయినప్పటి నుంచి శ్రీకాకుళంలో వైరస్ ఉనికి లేదు. హఠాత్తుగా ముగ్గురికి సోకడంతో… అధికారవర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. మొత్తంగా నెల రోజులుగా లాక్ డౌన్లో ఉంది. అంతర్ జిల్లాల రాకపోకలు కూడా లేవు. అలాంటిది హఠాత్తుగా ముగ్గురికి.. ఎలా వచ్చిందన్నది అంతుబట్టని విషయంగా మారింది. అది కూడా.. గ్రామాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం 29 గ్రామాల్ని పోలీసులు దిగ్బంధించారు.
ఇక అత్యధికంగా కేసులు నమోదవుతున్న జిల్లాల్లో ఆ జోరు సాగుతోంది. ఇరవై నాలుగు గంటల్లో 61 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 25, కర్నూలులో 14, కడప, నెల్లూరులో 4 కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. 31కి చేరింది. ఇప్పటి వరకు ఏపీలో నమోదైన పాజిటివ్ కేసులు 1016కి చేరాయి. మృతులు డిశ్చార్జ్ అయిన వారిని తీసేయగా.. 814 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్నటి వరకూ.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కరోనా ఫ్రీ స్టేట్‌గా ఉండేవి. ఇప్పుడు.. ఒక్క విజయనగరం జిల్లాకు మాత్రమే ఆ ట్యాగ్ మిగిలింది.
పొరుగు రాష్ట్రాల్లో తగ్గుతున్న కరోనా ప్రభావం.. ఏపీలో మాత్రం ఎందుకు పెరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. సాధారణంగా 28 రోజుల పాటు కేసులు నమోదు కాలేదంటే.. అక్కడ కరోనా ఎఫెక్ట్ లేదని భావిస్తారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా 30 రోజులకుపైగా లాక్ డౌన్ లో ఉంది. కేసులు నమోదు కాలేదు. కానీ ఇప్పుడు నమోదయ్యాయి అంటే… అది అంతకు ముందే కొంత మందికి సోకిందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కేసులు బయటపడ్డాయి. అసలు ఎలా ఆ వైరస్ సోకిందన్నది తెలుసుకుంటేనే.. శ్రీకాకుళం సేఫ్. లేకపోతే.. వైరస్ విస్తరించే అవకాశం ఉంది.