హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం పోటా పోటీగా జరుగుతోంది. ఏపీలో స్కోర్ 6 ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్సీ కాగా, తెలంగాణలో పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 10గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో ముగ్గురు క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరబాద్లోని జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జంప్ అవబోతున్నారని ఒక ఆంగ్ల పత్రిక ఇవాళ పెద్ద కథనాన్ని ఇచ్చింది. మార్చి 10న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు ముందే వీరు గోడ దూకబోతున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఆ కథనమే నిజమైతే టీడీపీలో రేవంత్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య ఇద్దరే మిగులుతారు. ఈ ఇద్దరిలో కృష్ణయ్య ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాను టీడీపీకి, టీఆర్ఎస్కు రెండింటికీ దూరంగా ఉంటానని ఆయన చెప్పారు. అధికారాన్ని అనుభవించటానికే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళుతున్నారని అన్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతానని చెప్పారు. మరోవైపు మాగంటి గోపీనాథ్ మాత్రం ఈ ఊహాగానాలను ఖండిస్తున్నారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు దీనిపై పుకార్లు వ్యాపింపజేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. మొత్తంమీద చూస్తుంటే టీఆర్ఎస్లో టీడీపీ విలీనం అనివార్యమనిపిస్తోంది.