ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ప్రతీరోజూ అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు నిత్యకృత్యం అయిపోయింది. ఈరోజు మరో అడుగు ముందుకు పడి… సభ్యుల సస్పెన్షన్ల వరకూ వ్యవహారం వెళ్లింది. కొత్త అసెంబ్లీలో ఇదే తొలి సస్పెన్షన్ కావడం విశేషం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలంటూ టీడీపీ సభ్యులు సభలో పట్టుబట్టారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో, మీడియా సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 45 సంవత్సరాలు నిండగానే పెన్షన్లు ఇస్తామని జగన్ చెప్పారనీ, దానిపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ సభ్యులు సభలో డిమాండ్ చేశారు. 45 ఏళ్లకు పెన్షన్ హామీపై గతంలో జగన్ చేసిన ప్రసంగాలను ఒక పెన్ డ్రైవ్ లో స్పీకర్ కి ఇచ్చి, ప్లే చేయాలంటూ కోరారు. దీనిపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.
దీంతో ఆగ్రహించిన సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. టీడీపికి చెందిన అచ్చం నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులని సస్పెండ్ చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. స్పీకర్ వెంటనే దీన్ని ఆమోదించినా, టీడీపీ సభ్యులు బయటకి వెళ్లకపోవడంతో… మార్షల్స్ తో వారిని బయటకి గెంటించారు. దీంతో టీడీపీ సభ్యులు సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్లో స్పందిస్తూ… వారెవ్వా, ప్రజల పక్షాన నిలిస్తే రాజన్న రాజ్యంలో పరిస్థితి ఇదీ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ సస్పెన్షన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించాల్సి ఉంది.
ముగ్గురు టీడీపీ సభ్యుల్నీ తాజా సమావేశాలు పూర్తయ్యే వరకూ సస్పెండ్ చేశారు. అయితే, దీన్ని ఎత్తివేయాలంటూ టీడీపీ సభ్యులు స్పీకర్ ని కోరారు. ఎలాంటి కారణాలూ చూపుకుండా సమావేశాలు పూర్తయ్యే వరకూ ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ఆ తరువాత, అధికార ప్రతిపక్ష సభ్యులతో స్పీకర్ మాట్లాడారు. ఈ నిర్ణయంలో మార్పు ఉంటుందనే ఆశాభావం టీడీపీ నుంచి వ్యక్తమౌతోంది. అయితే, ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మరోలా స్పందించారు. సభా మర్యాదలు పాటించని వారిని శాశ్వతంగా శాసన సభ నుంచి బహిష్కరించాలని అన్నారు. అంటే, గత ప్రభుత్వంలో వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారాన్ని గుర్తుచేసే ప్రయత్నంగా ఈ మాటలున్నాయి! ఈ ముగ్గురు సస్పెన్షన్ పై ఇక్కడితో ఆగుతారో, ఇంకాస్త ముందుకెళ్లి కఠిన చర్యలు అంటారో చూడాలి.