వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మూడేళ్లు పూర్తయ్యాయంటూ వైసీపీ సంబరాలు చేస్తోంది. అయితే.. ఆ పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను.. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో ఎన్ని అమలు చేశారన్న చర్చ ఇప్పుడు అందరిలోనూ నడుస్తోంది. మేనిఫెస్టోలో పెట్టిన వాటి సంగతి సరే.. పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. హామీలు కావా అనేప్రశ్నలు వినిపిస్తున్నాయి. మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు మాత్రమే కాదు.. పాదయాత్రలో అడుగుకో హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.
పులివెందులో తాను పాదయాత్ర ప్రారంభించిన రోజున ఓ వృద్ధురాలు తనకు ఉండటానికి ఇల్లు లేదని..తిండి పెట్టేవారు లేరని అంటే ప్రతీ చోటా ఓల్డేజ్ హోమ్స్ కట్టిస్తానని హామీ ఇచ్చారు. అలాంటి హామీలు అడిగిన ప్రతీ ఒక్కరికి ప్రతీ చోటా ఇచ్చుకుంటూ ఇచ్చాపురం వరకు వచ్చారు. చివరికి అగ్రిగోల్డ్ బాధితులకు రాగానే తొలి బడ్జెట్లో 1150 కోట్లు ఇచ్చేసి .. అందరికీ పంచేస్తానని ప్రకటించారు. ఏడాదిన్నరలో గత ప్రభుత్వం కేటాయించి.. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం సిద్ధం చేసిన 300 కోట్లలో 250 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా నిధుల ఊసే లేదు. అది వ్యక్తులకైనా.. వ్యవస్థకైనా … ప్రజలకు ఇచ్చిన హామీలైనా అదే పరిస్థితి. తాను రాగానే ప్రధానార్చక హోదా ఇచ్చేస్తానని రమణదీక్షితులకు భరోసా ఇచ్చిన జగన్ దాన్ని నెరవేర్చలేకపోయారు.
కార్డుదారులందరికీ సన్నిబియ్యం ఇస్తామన్న హామీకి చివరికి నాలుక మడతేసి.. అడిగిన వారిని బండబూతులు తిట్టేస్తున్నారు. ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ అని కరోనా టైంలోనే అందర్నీ క్యూలో నిలబెట్టారు. జగన్ నుంచి హామీలు పొందిన వాళ్లలో చాలా మంది విసిగి వేసారిపోయి.. సీఎం పీఠంపై దర్జాగా కూర్చున్న జగన్మోహన్ రెడ్డిని అడుగుదామని తాడేపల్లికి వస్తున్నారు. కానీ ఆయన ఇంటి చుట్టూ పదవి చేపట్టినప్పటి నుండి 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవర్నీ కలవనీయడం లేదు.. కలవడం లేదు. మధ్యలో ప్రజాదర్బార్ పెడతామని ప్రకటించారు. ప్రజావేదిక కూల్చేసిన తర్వాత తాడేపల్లిలో అలాంటి వేదిక కట్టి ప్రజలను కలవడానికి కోట్లు మంజూరు చేశారు కానీ ఇంత వరకూ కలవడమే జరగడం లేదు..
పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను లెక్కలేసుకుంటే ఓ పుస్తకం అవుతుంది. అందులో అమలు చేసినవి ఎన్ని అంటే.. ఓ పేజీ ఎక్కువే అవుతుంది. కానీ వైసీపీ నేతలు మాత్రం సంబరాలు చేసేసుకుంటున్నారు. ప్రజలంతా తమను పొగిడేస్తున్నారని చెప్పుకుంటున్నారు. పాదయాత్రలో అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించేస్తానని జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు పాదయాత్ర సంబరాలు చేసుకుంటున్నప్పుడు అనేక వర్గాలకు జగన్ ఇచ్చిన హామీలే గుర్తుకు వస్తున్నాయి.