4జి కేబుల్స్ వేసుకోడానికి టవర్ల ప్రతిష్ఠాపనకు రిలయెన్స్ చేసే దరఖాస్తులపై మున్సిపాలిటీలు 30 రోజుల్లో అనుమతి ఇవ్వాలి. అలా అనుమతి ఇవ్వలేకపోతే గడువు ముగియడాన్నే అనుమతిగా భావించి కేబుల్స్, టవర్స్ వేసుకోవచ్చునని రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందువల్ల టవర్ల పై ప్రజల అభ్యంతరాలను కౌన్సిళ్ళలో కార్పొరేటర్లు, కౌని్సలర్లు కనీసం చర్చించే అవకాశాన్ని కూడా రాష్ట్రప్రభుత్వం చెత్తడబ్బాలొ వేసేసింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలోనూ ఇపుడున్న ఎలకి్ట్రకల్ లైట్లను తొలగించి వాటి స్ధానంలో ఎల్ ఇ డి లైట్లను వేసే పనిని ఒకే సంస్ధకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ పేరుతో ఒక కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం రిజిష్ట్రర్ చేయించింది. ఖాళీస్ధలాలను డెవలప్ మెంటుకోసం ప్రయివేటు సంస్ధలకు ఇవ్వడమే ఈ సంస్ధపని. స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ అనే మరో సంస్ధ కూడా రిజిష్ట్రర్ అయ్యింది. చెత్తతో విద్యుత్ ఉత్పత్తి వంటి ప్రయోజనాలను సాధించే ప్రాజెక్టులకు ఈ కార్పొరేషన్ అనుసంధాన కర్తగా వుంటుంది.
ఇవన్నీ ప్రజాప్రయోజనాలకోసమే అనిపిస్తూంది. ఇవన్నీ అవసరంకూడా. అయితే నగరాలవారీగా, పట్టణాలవారీగా, వనరులు, అవసరాలను సాంకేతిక నిపుణుల సాయంతో మదింపుచేసుకోవడం అవసరమైన సేవల గురించి ప్రకటించడం స్ధానిక స్వపరిపాలనా సంస్ధల బాధ్యతే! కాంటా్రక్టర్లు, సప్లయర్లు ఆయానగరాలకు వెళ్ళి రేటు కాంటా్రక్టు ప్రకారం సేవలు అందించడం జరగాలి. ఇందువల్ల ఆనగర, పట్టణ పాలనా యంతా్రంగానికి కాంటా్రక్టర్ల పై అదుపు వుంటుంది.
అయితే మున్సిపల్ సర్వీసులన్నిటినీ రాష్ట్రవ్యాప్తంగా ఒకే గొడుగులోకి తీసుకురావడం వల్ల అధికారాలూ బాధ్యతలూ ఒకే చోట కేంద్రీకృతమై ‘స్ధానిక స్వపరిపాలన’ అనే మౌలిక మైన లక్ష్యం ధ్వంసమైపోతుంది.
లైట్లు మాడిపోతున్నాయని కౌన్సిలర్ అడిగితే మాది లోకేష్ బాబు రికమెండ్ చేసిన కంపెనీ తెలుసుకో అని చిరు ఉద్యోగి బెదిరించడానికీ, అదేమాట కమీషనర్ అడిగితే హెడ్డాఫీస్ కి ఇన్ ఫామ్ చేశాం సర్ అని వినయంగానే బాధ్యతనుంచి తప్పించుకోడానికీ ఈ కేంద్రీకృత విధానం ఆస్కారమిస్తుంది. రాష్ట్రవ్యాప్త కార్పొరేషన్లు సహకార చట్టం కిందనో, ట్రస్టులగానో కాక కంపెనీల చట్టం ప్రకారం రిజిష్ట్రర్ అవుతూ వుండటం ప్రమాదకర సంకేతాన్ని ఇస్తోంది. కంపెనీకి పెట్టుబడులు అనివార్యం. స్ధానిక సంస్ధల నుంచి, ప్రభుత్వం నుంచి మూలధనాలు సమకూరుస్తారు. తరువాత ప్రభుత్వం తన వాటాలు అమ్ముకోడానికి వీలుగానే కంపెనీ ఏర్పాటు జరుగుతుంది. అంటే వాటాలుకొన్న పెట్టుబడిదారులకు కంపెనీ వశమౌతుంది.
మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్రాంట్లలో కోత పడింది. నిధుల లేమి అడ్డం పెట్టి స్థానిక సంస్థలు పన్నుల భారాలు మోపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 39 శాతం నిధులు స్థానిక సంస్థలకు బదలాయించాలని రాష్ట్ర ఆర్థిక సంఘం(ఎస్ఎఫ్సి) సిఫార్సులు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ చెల్లింపులు సజావుగా వుంటే స్ధానిక సంస్ధలకు నిధులకోరత వుండదు. ఆపని చేయకుండా పట్టణాలు, నగరాల్లో సర్వీసులను పూర్తిగా వ్యాపార వస్తువుగా మార్చేసి లాభాలు ప్రయివేటు రంగానికే దక్కేలా ప్రభుత్వమే ఏర్పాట్లు చేయడంలో ప్రజాహితం కంటే ప్రజాహితం నుంచి తప్పించకునే లక్షణమే ఎక్కువగా కనబడుతోంది.
డెవలప్ మెంటు పద్ధతిలో రాజధాని నిర్మాణానికి భూములు అప్పగించాలన్న విధానం వల్ల ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారి అనే విమర్శను నెత్తికెత్తుకున్న రాష్ట్రప్రభుత్వం స్ధానిక సంస్ధల సర్వీసులను దగ్గరుండి ప్రయివేట్ రంగానికి కట్టబెట్టే దిశగా నడుస్తున్నందువల్ల దళారీ అనే విమర్శను భుజాన మోయవలసి వుంటుంది.