బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని మరో పది మెట్లు ఎక్కించాడు రామమౌళి. ఈ సినిమాని ఎవ్వరూ తెలుగు సినిమాగా చూడలేదు. భారతీయ సినిమాగా కీర్తించారు. ప్రపంచ యవనికపై టాలీవుడ్ పతాకని రెపరెపలాడించిన ఘనత కచ్చితంగా బాహుబలిదే. ఈ సినిమా సాధించిన అనితర సాధ్యమైన విజయాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే బాహుబలి 2పై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. వాటిని అందుకోవడానికి రాజమౌళి అండ్ టీమ్ విపరీతంగా శ్రమిస్తోంది కూడా. బాహుబలి 2ని… మరోస్థాయిలో చూపించాలని అహర్నిశలూ కష్టపడుతున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నాహాల్లో ఉంది బాహుబలి టీమ్. 90 రోజుల పాటు ఈ సన్నివేశాల్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పతాక సన్నివేశాలకే ఏకంగా రూ.30 కోట్లు కేటాయించనున్నార్ట.
స్టార్ హీరోతో సినిమా తీయడానికి అయ్యే బడ్జెట్‌తో ఓ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించడం చూస్తుంటే బాహుబలి 2 ఏ రేంజులో సిద్ధమవుతోందో అర్థం చేసుకోవొచ్చు. బాహుబలి ది బిగినింగ్ లో వార్ ఎపిసోడ్స్‌కి విశేష స్పందన వచ్చింది. అయితే ఆ సీన్లు తెరకెక్కించడానికి అయ్యింది 15 కోట్లేనట. దానికి రెట్టింపు బడ్జెట్.. సమయం బాహుబలి 2 క్లైమాక్స్ ఎపిసోడ్‌కి కేటాయించారు. దాన్ని బట్టి… బాహుబలి – కన్‌క్లూజన్‌లో క్లైమాక్స్ ఏ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారో అర్థం చేసుకోవొచ్చు. ఈ వార్ ఎపిసోడ్‌తోనే సినిమా షూటింగ్ కూడా ముగియబోతోంది. అక్టోబరు – నవంబరు కల్లా షూటింగ్‌ని పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో దిగిపోవాలన్నది రాజమౌళి ప్లాన్.