తెలుగు360 రేటింగ్: 2/5
టైటిల్ చూసి సినిమా చూడమన్నారు.. పెద్దోళ్లు. అందుకే మనోళ్లు వెరైటీ టైటిల్స్ వెదికేస్తుంటారు. సినిమా ఎలా వున్నా – టైటిల్ థియేటర్లకు రప్పిస్తుందన్న చిన్న ఆశ. `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` అనే టైటిల్ కూడా భలే క్యాచీగా కుదిరిపోయింది. యాంకర్ ప్రదీప్ హీరో అవ్వడం, `నీలీ నీలీ ఆకాశం ఇద్దామనుకున్నా` పాట ఈ సినిమాకి పెద్ద బూస్టప్‌గా నిలవడంతో… `30 రోజుల్లో..`పై ఆశలు, అంచనాలూ గట్రా పెరిగాయి. టైటిల్ లో ఉన్న ఆ కొత్తదనం సినిమాలో వుందా? నీలీ నీలీ ఆకాశం… పాటే కాకుండా ఈ సినిమాలో ప్రత్యేకతలేమైనా దాగున్నాయా? – వివరాల్లోకి వెళ్తే..
అర్జున్ (ప్రదీప్ మాచిరాజు) ఈ తరం కుర్రాడు. చదువు ఎక్కదు. బాక్సింగ్ అంటే మక్కువ. అదేంటో.. గానీ అమ్మని అస్సలు పట్టించుకోడు. తన కాలేజీలో అర్చన (అమృత అయ్యర్) కొత్తగా జాయిన్ అవుతుంది. అర్జున్ – అర్చనలు చూడగానే ద్వేషించుకోవడం మొదలెడతారు. ఒకరిపై ఒకరు నెగ్గాలన్న ప్రయత్నం. సరదాగా అరకు వెళ్తే… అక్కడ అనుకోకుండా అర్జున్ అర్చనలా, అర్చన అర్జున్ లా మారిపోతారు. అంటే.. అర్చన బాడీలో అర్జున్, అర్జున్ బాడీలో అర్చన వెళ్లిపోతారు. దానికి కారణం పునర్జన్మ కూడా. అసలు అర్జున్, అర్చన ఇలా మారిపోవడానికి కారణమేంటి? పునర్జన్మలో వీళ్ల కథేంటి? అనేదే `30 రోజుల్లో ప్రేమించడం ఎలా?` సినిమా.
పునర్జన్మ అన్నది కొత్త కాన్సెప్టేం కాదు. మూగ మనసులు దగ్గర్నుంచి, మగధీర వరకూ వాడేసిన కాన్సెప్టే. దానికి `జంబలకిడి పంబ` అనే ట్రాక్ ని జోడించారు. ఇవేం సరిపోవేమో. అనే డౌట్ వచ్చిందేమో, కాస్త బాక్సింగ్ కథ, కాస్త మదర్ సెంటిమెంట్.. ఇవన్నీ పేర్చుకుంటూ వెళ్లిపోయి.. ఈ కథని తయారు చేశారు. నిజానికి పునర్జన్మ అన్న పాయింట్ చాలా సెన్సిబుల్ గా ఉంటుంది. దాన్ని ముట్టుకోకూడదు గానీ, ముట్టుకుంటే… ఏదో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాల్సిందే. బలమైన ఎమోషన్ పండించాల్సిందే. కానీ కొత్త దర్శకుడు మున్నా.. ఆ విషయంలో తేలిపోయాడు. కథకు ఓ కొత్త యాంగిల్ ఇవ్వాలన్న తాపత్రయంతో.. పునర్జన్మల కాన్సెప్టు ఎంచుకున్నాడు కానీ, ఆ తరవాత చెప్పాల్సిన అసలు కథకూ.. దానికీ సంబంధమే లేదు.
కాలేజీ సీన్ల విషయానికి వద్దాం. హీరో, హీరోయిన్లకు అస్సలు పడదు. ఒకరిపై ఒకరికి మంట. అందుకోసం టిట్ ఫర్ టాట్ అన్నట్టు.. ఒకరిపై ఒకరు అస్త్రాలు సంధిస్తూనే ఉంటారు. ఆ సన్నివేశాలన్నీ… గత సినిమాల్లో చూసినట్టే అనిపిస్తాయి. అమ్మాయిల హాస్టల్ లో అమ్మలు దూరి… తమ కూతుర్లని చెడుగుడు ఆడేయడం… అచ్చంగా `పటాస్`లోని కాన్సెప్టు. ఆ యాక్షన్ ఎపిసోడ్… అమ్మలు గాల్లో ఎగిరి.. కూతుర్లని గింగిరాలు తిప్పించడం, సినిమా హీరోల్లా ఫైటింగులు చేయడం, పాత సినిమాల స్నూఫ్లను వాడుకోవడం.. ఇదంతా మాస్ కి నచ్చొచ్చు. కాకపోతే… కాపీ ఐడియానే అని తెలిసిపోతుంది. లీకైన పేపర్ ఏంటో చూసుకోకుండా.. దాన్నే బట్టీ పట్టి… హీరో బ్యాచ్ ఫెయిల్ అయిపోవడం లాంటి ఒకటీ అరా సీన్లు పండాయి. దాంతో.. కాస్తో కూస్తో ఎంటర్టైన్మెంట్ దొరికింది.
ఇక సెకండాఫ్ లో జంబలకిడి పంబ ఎపిసోడ్ మొదలవుతుంది. హీరో – హీరోయిన్ లా మారడం, హీరోయిన్ హీరోలా మారడం.. ఇదీ కాన్సెప్టు. ఇది కూడా ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసేసిందే కాబట్టి.. ఆ ఎపిసోడ్ కొత్తగా కనిపించదు. పైగా బోరింగ్ గా అనిపిస్తుంది. ఓ దశలో… గందరగోళంగానూ ఉంటుంది. అదే ఎపిసోడ్ ని పట్టుకుని చివరి వరకూ లాక్కొచ్చాడు దర్శకుడు. నిజానికి పునర్జన్మల కథకీ, ప్రజెంట్ కథకీ లింకే లేదు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే టైటిల్ కీ జస్టిఫికేషన్ దొరకలేదు. `మీరు 30 రోజుల్లో ఇక్కడికి తిరిగి రండి.. మీరు మీలా మారిపోవొచ్చు` అని స్వామిజీ చెబుతాడు గానీ.. `30 రోజుల్లో ప్రేమించుకుని రండి` అనడు. నిజంగా స్వామీజీనే `మీరు 30 రోజులు ప్రేమించుకోండి. తరవాత రండి` అని చెబితే.. ఈ కథ వేరేలా వుండేదేమో? చివర్లో సెంటిమెంట్ డోసు పెంచి, మదర్ సెంటిమెంట్ జోడించి.. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే ప్రయత్నం చేశారు. బాక్సింగ్ రింగులో… హీరో విశ్వరూపం చూపించి, అదే రింగులో హీరో, హీరోయిన్లని కలిపేసి శుభం కార్డు వేశారు. నీలీ నీలీ ఆకాశం పాట సూపర్ హిట్టయ్యింది. అలాంటి పాట ని జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి. కానీ సినిమా మొదలైన పది నిమిషాల్లోనే ఆ పాట అయిపోతుంది. ఆ పాట కోసం ఎదురు చూసేలా ఆడిటోరియాన్ని సిద్ధం చేసుకునే టెక్నిక్ దర్శకుడికి తెలియలేదు.
ప్రదీప్ యాంకర్‌గా సుపరిచితుడు. తనలో నటుడూ ఉన్నాడన్న విషయం.. స్టేజీపైనే తెలిసిపోయింది. వెండి తెర కూడా తనకేం కొత్తగా అనిపించలేదు. తనదైన ఈజ్ తో బాగానే చేశాడు. ఓ పాటలో స్టెప్పులూ వేసి, తనలో హీరో క్వాలిటీస్ ఉన్నాయని నిరూపించుకొనే ప్రయత్నం చేశాడు. అమృత కొన్ని చోట్ల క్యూట్ గా వుంది. ఇంకొన్ని చోట్ల తేలిపోయింది. వైవాహర్ష కాస్తలో కాస్త నవ్వించాడు. హేమ, పోసాని, శుభలేఖ సుధాకర్ ఇలాంటి సీనియర్లు తమ వంతు పాత్రని.. ఎలాంటి ఇబ్బందీ లేకుండా నిర్వహించుకుంటూ వెళ్లిపోయారు.
అనూప్ సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. నీలీ నీలీ ఆకాశంతో పాటు.. మరో రెండు పాటలు కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా కూల్ గా వుంది. ఫొటోగ్రఫీతో కాస్త రిచ్ లుక్ వచ్చింది. దర్శకుడు మున్నా.. ఒకేసారి చాలా విషయాలపై ఫోకస్పెట్టాలనుకున్నాడు. అదే ఇబ్బంది పెట్టింది కూడా. ఏ పాయింట్ పైనా ప్రత్యేక శ్రద్ధ చూపించలేదు. కాలేజీ సన్నివేశాలు, హాస్టల్ సీను.. లాంటివి యూత్ ని ఆకట్టుకునే అవకాశం వుంది. జంబలకిడి పంబ.. కాన్సెప్టు కాకుండా… ద్వితీయార్థం మరోలా నడిపించి వుంటే.. బాగుండేది.
ప్రదీప్ లో ఓ హీరో ఉన్నాడన్న సంగతి చెప్పడానికి ఈ సినిమా ట్రంప్ కార్డులా ఉపయోగపడుతుంది. అంతకు మించి.. ఈ సినిమా నుంచి ఆశించడానికి ఏం లేదు!
ఫినిషింగ్ టచ్: జంబలకిడి పంబ
తెలుగు360 రేటింగ్: 2/5