కొన్ని సినిమాలు ఎప్పుడు చూసినా ఫ్రెష్ గా ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా అదే మ్యాజిక్. అలాంటి సినిమాల్లో ఆదిత్య 369 ఒకటి. తెలుగులో ఇదో మైలురాయి. ఆ మాటకొస్తే.. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే ఓ కొత్త తరహా ప్రయోగం. అప్పటి వరకూ సైన్స్ ఫిక్షన్ ని ఫాంటసీతో మేళవించిన కథ రాలేదు. ఆదిత్య 369తోనే అది మొదలు. ఇప్పటికీ ఈ సినిమా గురించి బాలకృష్ణ కలవరిస్తూనే ఉంటారు. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని చెబుతూనే ఉంటారు. ఈ మ్యాజిక్ జరిగి.. నేటికి పాతికేళ్లు.
టైమ్ మిషన్ కాన్సెప్టులో హాలీవుడ్ లో వచ్చిన కొన్ని సినిమాల్ని చూసి.. స్ఫూర్తి పొందారు సింగీతం. ఆ కథ.. ఆయన మనసులో అలా నిష్కిప్తమై ఉంది. కానీ… నిర్మాతలేరి? ఆయన్నీ, ఆయన ఆలోచనల్ని అర్థం చేసుకునేవారెవరు? అందుకే… ఆ కథని ఆయనలోనే దాచేసుకున్నారు. ఓసారి విమాన ప్రయాణంలో.. పక్కసీటులో యాదృచ్చికంగా కనిపించిన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో సరదాగా ఈ కథ గురించి డిస్కర్స్ చేశారు. ఈ కథ బాలూకి పిచ్చపిచ్చగా నచ్చేసింది. అంతకు ముందే… ఆయనకు నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ తో పరిచయం ఉంది. విమానం దిగిన వెంటనే బాలు చేసిన పని… శివలంకకు ఫోన్ చేయడం. ఓ మంచి కథ ఉంది.. సింగీతం గారిని కలువు.. అని కబురు చెప్పారు. వెంటనే సింగీతంలో సిట్టింగ్ మొదలైంది. కథ ఓకే అయ్యింది. బాలయ్య కూడా రెడీ అన్నాడు. అలా.. ఆదిత్య 369 మొదలైంది.
ముందు అనుకున్న బడ్జెట్ కోటిన్నర. అయితే అందుకు 30 లక్షలు ఎక్కువ ఖర్చైంది. ఈ సినిమాకి యుగ పురుషుడు, ఆదిత్యుడు అనే టైటిళ్లు అనుకున్నారు. చివరికి ఆదిత్య 369 సెట్ చేశారు. టైటిల్ వినగానే అందరికీ నచ్చేసింది. 369 ఏంటన్న క్వశ్చన్ మొదలైంది. అదే ఈ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీగా ఉపయోగపడింది. ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా విజయశాంతిని అనుకున్నారు. కానీ.. ఆమె డేట్లు అందుబాటులో లేవు. అందుకే.. కొత్తమ్మాయి అయినా సరే, మోహినిని తీసుకున్నారు. ఈ సినిమాకి ముగ్గురు ఛాయాగ్రహకులు పనిచేశారు. పిసీశ్రీరామ్ అనారోగ్యంతో తప్పుకోవడంతో కబీర్ దాస్, స్వామి.. మిగిలిన సినిమాని పూర్తి చేశారు. భూత, భవిష్యత్త్, వర్తమాన కాలాల్ని ఒకే సినిమాలో చూపించడం… ఆదిత్య 369 ప్రత్యేకత. ఆయన కాలానికంటే పాతికేళ్లు ముందుకెళ్లి ఆలోచించి, సంగీతం ఈ సినిమా తీశారు. ఇళయరాజా పాటలన్నీ సూపర్ హిట్.
దీనికి సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆదిత్య 999 పేరుతో సింగీతం ఓ కథ రాసుకున్నారు కూడా. బాలయ్య 100వ సినిమాగా అదే పట్టాలెక్కాలి. కానీ కథలో కొన్ని అనుమానాలు ఉండడంతో.. దాన్ని పక్కన పెట్టేశారు. అయితే ఈ సినిమాకి తప్పకుండా సీక్వెల్ ఉంటుందని బాలయ్య ఇటీవలే ప్రకటించారు. దానికి కథ కూడా ఆయనే రాశార్ట. అంతేకాదు.. ఈ సినిమాతో బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.