హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) సంస్థపై ఇస్లామిక్ దేశాలు యుద్ధం ప్రకటించాయి. ఐసిస్ బారినుంచి ఇస్లామిక్ దేశాలను రక్షించటమే లక్ష్యంగా ఇస్లామిక్ మిలటరీ కూటమి ఏర్పాటయింది. 34 దేశాల ఈ కూటమికి సౌదీ అరేబియా నేతృత్వం వహించనుంది. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, లిబియా, యెమెన్, ఖతార్, యూఏఈలతో పాటు మాలి, చాద్, నైజీరియా, సోమాలియావంటి దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. అయితే షియాల ప్రాబల్యం అధికంగా ఉన్న ఇరాన్, ఇరాక్ దేశాలు మాత్రం ఈ కూటమికి దూరంగా ఉన్నాయి. సౌదీ రాజధాని రియాద్ కేంద్రంగా పనిచేసే ఈ కూటమిలోని సంకీర్ణ దేశాల సేనలు ఐఎస్ ఉగ్రవాదులపై సంయుక్తంగా దాడులు చేయటంతో పాటు, పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. ఈ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని అంతం చేస్తామని ఇస్లామిక్ మిలిటరీ కూటమి ప్రతిజ్ఞ చేసిందని సౌదీ అరేబియా న్యూస్ ఏజెెన్సీ స్పా వెల్లడించింది. ఐఎస్‌పై గల్ఫ్, అరబ్ దేశాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలన్న అమెరికా సూచనపై సౌదీ అరేబియా యువరాజు, ఆ దేశ రక్షణమంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ స్పందించారు. ఉగ్రవాదంపై ఇప్పటివరకు కొన్ని ముస్లిమ్ దేశాలు వ్యక్తిగతంగా పోరాడుతున్నాయని, ఇకనుంచి ఇస్లామిక్ మిలటరీ కూటమిలోని సంకీర్ణదేశాల సేనలు సంయుక్తంగా దాడులు చేస్తాయని సల్మాన్ చెప్పారు.