35 Chinna Katha Kaadu Movie Telugu Review
సినిమా అంటేనే ‘లెక్క’.
ఆల్ జీబ్రాలా అంతు చిక్కని లెక్క.
కాంబినేషన్ ప్లస్సు.
కమర్షియాలిటీ ప్లస్సు.
థియేట్రికల్ ఎక్స్పీరియన్సు ప్లస్సు.
సినిమాలో ఇందులో ఒక్కటి లేకపోయినా మైనస్. ఒక్కోసారి హంగులెక్కువైనా మైనస్సే. అందుకే ఏ కథ రాసుకొన్నా ఈ లెక్కలు పట్టించుకోవాలి. అయితే కొన్ని కథలు మాత్రం ఇలాంటి లెక్కలేం లేకుండా హాయిగా రెక్కలు విప్పుకొని ఎగురుతుంటాయి. డివైడెడ్ బైలూ, ఇంటూల గోల లేకుండా స్వేచ్ఛ విహరిస్తుంటాయి. అలాంటి సినిమానే ’35: చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి సైలెంట్ గా వచ్చిన సినిమా ఇది. రానా సమర్పకుడిగా వ్యవహరించారు. నివేతా థామస్ ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో నటించడం, ప్రచార చిత్రాల్లో ఏదో ఓ ఆకర్షణ శక్తి కనిపించడంతో సినీ ప్రేమికుల కళ్లు ’35’ పై పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? కమర్షియల్ లెక్కల్ని ఏమాత్రం పట్టించుకోని ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్ని ఎంత వరకూ గెలుచుకొంది?
సరస్వతి (నివేతా థామస్) ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ) భార్యాభర్తలు. తిరుపతిలో నివాసం. ప్రసాద్ బస్సు కండెక్టర్. సరస్వతి టెన్త్ ఫెయిల్ అయిన సాధారణ గృహిణి. ఇద్దరు పిల్లలు. పెద్దోడు అరుణ్ (అరుణ్ దేవ్), చిన్నోడు వరుణ్ (అభయ్ శంకర్). చిన్నోడు పర్వాలేదు కానీ పెద్దోడు లెక్కల్లో `జీరో`. అందుకే లెక్కల మాస్టారు చాణక్య కూడా అరుణ్‌ని ‘జీరో’ అనే పిలుస్తాడు. లెక్కలకు సంబంధించి అరుణ్ ఎప్పుడూ లాజిక్కులు అడుగుతుంటాడు. మాస్టార్ల దగ్గర కూడా వాటికి సమాధానం ఉండదు. లెక్కల్లో వరుసగా జీరోలు తెచ్చుకోవడం వల్ల ఒక సంవత్సరం డిమోట్ కూడా అయిపోయి, తన తమ్ముడు చదువుతున్న క్లాసులోనే అడుగుపెట్టాల్సివస్తుంది. స్నేహితులు దూరమై, చదువు భారమై, ఈసారి స్కూల్లో ఉండాలంటే లెక్కల్లో కనీసం ’35’ మార్కులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అరుణ్ ఏం చేశాడు? లెక్కలంటే భయపడుతున్న కొడుకుకి టెన్త్ ఫెయిల్ అయిన ఓ అమ్మ ఎలా పాఠాలు చెప్పింది? అరుణ్ లెక్కల పరీక్షలో పాస్ అయ్యాడా, లేదా? అనేది మిగిలిన కథ.
ప్రశ్నించడం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే నేర్చుకోవడం, తెలుసుకోవడం ఆగిపోతాయి. అది మనుగడకే ప్రమాదం. మనుషులకూ, మిషన్లకూ ఉన్న తేడా ఆలోచనా శక్తి మాత్రమే. దాన్ని కోల్పోతే మనిషి అనే పదానికే అర్థం ఉండదు. చిన్న పిల్లలు ప్రశ్నిస్తారు. అది వాళ్ల సహజ గుణం. కొన్ని కొన్నిసార్లు దానికి సమాధానం దొరక్కపోవొచ్చు. కానీ లాజికల్ గా ఆలోచించి అనుమానం నివృత్తి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ముఖ్యంగా టీచర్లది.
ఆరో తరగతి చదువుతున్న కొడుకు చెస్ ఆడుతూ తల్లిని ‘అమ్మా… గుర్రం ఇలానే ఎందుకు దూకుతుంది?’ అని అమాయకంగా అడిగితే, దానికి తల్లి చెప్పిన లాజిక్ ఎంత అర్థవంతంగా ఉంటుందో..? అదే అబ్బాయి క్లాసులో ‘విలువ లేని సున్నా ఒకటి పక్కన నిలబడితే, అది తొమ్మిది కంటే ఎందుకు ఎక్కువ అవుతుంది?’ అని నిలదీస్తే టీచర్ సమాధానం చెప్పలేడు. ‘నా దగ్గర రెండు పెన్నులు ఉన్నాయి. దాన్ని జీరోతో గుణిస్తే జీరో ఎలా అవుతుంది. నా దగ్గర ఇంకా రెండు పెన్నులు ఉన్నాయి కదా. అవి లేకుండా ఎక్కడికి పోతాయ్’ అని అడిగితే.. ఆన్సర్ చెప్పలేక బ్యాక్ బెంచ్ కి నెట్టేస్తాడు. తల్లికి ఉన్న ఓర్పు, నేర్పూ టీచర్లకు ఎందుకు లేకుండా పోతుందో అనే ప్రశ్న సహేతుకమైనదిగా అనిపిస్తుంది.
గణితం బ్రహ్మపదార్థం కాదు. దాన్ని అర్థమయ్యేలా చెబితే, అంతకంటే అద్భుతమైన ఆట ఇంకోటి ఉండదు. ‘ఈ లెక్క ఇలానే చేయాలి’ అనేది థియరీ. కానీ ఓ ఆటగానో, ఆటవిడుపుగానో, కథగానో చెబితే అది పిల్లలకు మరింత సులభంగా అర్థం అవుతుంది. అప్పుడు లెక్కలంటే భయం పోతుంది. లెక్కలనే కాదు. లెక్కలే కాదు ఏ సబ్జెక్ట్ అయినా ఇదే సూత్రం. పిల్లలకు లెక్కలు ఎలా చెప్పాలో చెప్పే సినిమా ఇది. లెక్కల్ని ఎలా అర్థం చేసుకోవాలో పిల్లలకు చెప్పిన కథ ఇది. ఆ లెక్కన చూస్తే ’35’కి ‘100’ మార్కులు వేయొచ్చు.
ఈ కథని కె.విశ్వనాథ్ సినిమా స్టైల్ లో ఓపెన్ చేశాడు దర్శకుడు. బ్రాహ్మణ కుటుంబం, ఆ పద్ధతులు, వాళ్ల నడవడిక, మాట తీరూ.. అన్నీ కళ్ల ముందు సన్నివేశాల రూపంలో కదలాడతాయి. ఆ తరవాత కథ… పిల్లల కోణంలోకి షిఫ్ట్ అవుతుంది. లెక్కల మాస్టారు అనేవాడు ఎంత మంచోడైనా పిల్లలకు ఎప్పుడూ విలనే. కాబట్టి చాణక్య (ప్రియదర్శి) పాత్రని ఆ కోణంలోనే డిజైన్ చేశాడు దర్శకుడు. అయితే ఈ పాత్ర మరీ అంత క్రూరమైనదా.. అని అడిగితే ‘కాదు’ అనే చెప్పాలి. ‘నేను పిల్లలతో బాగుండకపోయినా ఫర్వాలేదు. పిల్లలు బాగుండాలి’ అనే స్వార్థం ఆ పాత్రది. ఆయన కోణంలో చూస్తే మాస్టారు చేసింది రైటే అనిపిస్తుంది.
చాలా చోట్ల దర్శకుడి మార్క్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కథని నడిపించిన విధానంలో. అరుణ్ లెక్కల్లో 35 మార్కులు తెచ్చుకొంటే సరిపోతుంది అనుకొంటే ఇది అచ్చంగా పిల్లల కథ అయిపోదును. ఇది అమ్మ కథగా మారాలి అంటే… సరస్వతి పాత్రని మరింత స్ట్రాంగ్ చేయాలి. ఆ పాత్రని కథలోకి లాక్కు రావాలి. అందుకోసం సరస్వతి చేత కూడా పుస్తకాలు పట్టించాల్సి వచ్చింది. అలా చేయడం వల్ల మదర్ ఎమోషన్ మరింత ధృడంగా తయారైంది. చాణిక్య – సరస్వతి మధ్య తీసిన సన్నివేశం చాలా సెలిల్డ్ గా అనిపిస్తుంది. వాళ్ల మాటల యుద్ధం.. లెక్కల సూత్రాల్లోనే సాగడం మరింత బాగుంది. పాస్ అయ్యాడని తెలియగానే ఆ చిన్న కుర్రాడు మగ్గులోంచి నీళ్లు తీసి గోడకున్న అద్దానికి కొట్టడం (అదెందుకో సినిమా చూస్తే తెలుస్తుంది) తప్పకుండా మంచి ఎమోషన్. ‘సున్నా’కి విలువ ఎందుకు లేదు? అనే ప్రశ్నతో ఈ కథ మొదలైంది. దానికి సమాధానం చెప్పాలి కదా? అరుణ్ జీవితం, అతనికి ఎదురైన సమస్యల్లోంచే దానికి సమాధానం రాబట్టిన విధానం దర్శకుడి పరిణతికి అద్దం పడుతుంది.
ఈ సినిమాలోనూ మైనస్సులు లేకపోలేదు. ఇలాంటి కథలకు ‘స్లో’ నేరేషన్ ఇబ్బంది పెడుతుంది. ప్రతీదీ కళాత్మకంగానో, కవితాత్మకంగానో, వివరణాత్మకంగానో చెప్పాలన్న దర్శకుడి ఆలోచన కథన వేగానికి కళ్లెం వేస్తుంటుంది. సాధారణ ప్రేక్షకుడు బాగా అలవాటు చేసుకొన్న కమర్షియల్ హంగులు మచ్చుకైనా దొరకవు. ఇక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటారా? కేజీఎఫ్‌లు, యానిమల్ లూ చూసిన కళ్లకు ఇవి ఆనవు. కానీ ఓ మంచి సినిమా, అనుభూతి కలిగించే కథ, మనదైన జీవితాలు, అందులోంచి పుట్టుకొచ్చే ప్రశ్నలు, వాటి చుట్టూ ఉత్పన్నమయ్యే భావోద్వేగాలూ.. ఇలాంటి సుగంధాల్ని కోరుకొంటే మాత్రం ’35’ నిరాశ పరచదు. కొన్ని కథల్ని చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని సినిమాల్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రేక్షకులపై ఉంది అనుకొంటే అది ఇలాంటి కథే.
నివేతాలో మెచ్యూరిటీ చూస్తే ముచ్చటేస్తుంది. ఇద్దరు పిల్లల తల్లిగా భలే ఇమిడిపోయింది. ప్రియదర్శితో చేసిన సీన్లో తన ప్రతిభ మరింత మెరుస్తుంది. ఓ తల్లిలా, భార్యలా, తన కొడుకుకు గురువిణిలా భిన్న పార్శ్వాలున్న పాత్ర పోషించింది. తన కెరీర్లో చెప్పుకోదగిన పాత్ర ఇది. విశ్వదేవ్ లాంటి కుర్ర హీరో ఇలాంటి పాత్ర చేయడానికి ముందుకొచ్చాడంటే గొప్పే. సగటు నాన్నలా బాగా కుదిరాడు. ప్రతీ ఎమోషన్ నీ స్కేలుతో కొలిచినట్టు పలికించాడు. పిల్లలంతా చిచ్చర పిడుగులే. ముఖ్యంగా వరుణ్ గుర్తుండిపోతాడు. తనలాంటి బాల నటుడ్ని పట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది ఓ గుంపునే తీసుకొచ్చింది చిత్ర బృందం. ప్రియదర్శికి ఇది డిఫరెంట్ పాత్ర. లెక్కల మాస్టారుకు ఉండాల్సిన (అవ)లక్షణాలన్నీ సరిగ్గా పట్టేశాడు. భాగ్యరాజాది మరీ గుర్తుండిపోయే పాత్ర కాదు. గౌతమిది మరీ తీసిపారేయాల్సిన క్యారెక్టర్ కాదు. వాళ్ల అనుభవం, వాళ్లపై ప్రేక్షకులకు ఉన్న ప్రేమతో ఆ పాత్రలపై మరింత గౌరవం ఏర్పడుతుంది.
సినిమాకి ఏం కావాలో అదే ఇచ్చారు నిర్మాతలు. అంతే ఖర్చు పెట్టారు. పాటలు చాలానే ఉన్నాయి. దాదాపు అన్నీ క్లాసికల్ టచ్‌తో సాగేవే. కథతో మమేకం అయిపోయాయి. దాదాపు అన్నీ ఒకే ట్యూన్లో సాగాయా? అని కూడా అనిపిస్తుంటుంది. మాటలు బాగా కుదిరాయి. ‘బుర్రకెక్కాల్సిన చదువులు భుజాలకెక్కుతున్నాయి’ (బ్యాగులను ఉద్దేశించి) అనే డైలాగ్ బాగా రాశారు. `పెరగాలి అనుకొన్నప్పుడు కొంచెం తుంచాలి.. కొమ్మైనా కొడుకైనా’ సందోర్భోచితంగా కుదిరింది. దర్శకుడిలో స్పార్క్ ఉంది. అది చాలాసార్లు కనిపించింది. డబ్బుల కోసం కాకుండా గౌరవం కోసం, అవార్డుల కోసం ఈ సినిమా తీసి ఉంటే.. ఈ సినిమాకు పని చేసిన వాళ్లలో చాలా మందికి అది దక్కుతుంది.