కేంద్రం మిధ్య అని నందమూరి తారక రామారామారావు చేసిన వ్యాఖ్యానం రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధాల్లో కేంద్రం పాటించవలసిన గౌరవమర్యాదలను ఎత్తి చూపింది. బిచ్చం వేసినట్టు నిధులు విదిలించడానికి ఎవడబ్బ సొమ్ము అని ఆయన గద్దించడం వల్లే రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా పెరిగింది.
ఇది (29-3-2016) తెలుగుదేశం 35 వ పుట్టిన రోజు మాత్రమే కాదు. కష్టకాలంలో వున్న ఆంధ్రప్రదేశ్ కి చట్టప్రకారం ఇవ్వవలసిన సహాయాన్ని కూడా ఆపేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి రీత్యా కూడా కేంద్ర రాష్ట్రప్రభుత్వాలపై విస్తృతమైన చర్చ జరగవలసిన సందర్భం.
జాతీయ పార్టీల వల్ల ప్రాధాన్యలు స్ధానిక లేదా ప్రాంత ప్రయోజనాలకు అడ్డుపడుతూండటం వల్లే ప్రాంతీయ పార్టీలు ఏర్పడుతున్నాయి. వాటిలో అన్నీ బతిక బట్టకట్టడంలేదు. తెలుగుదేశం పార్టీ అందుకు భిన్నంగా, ప్రత్యేకంగా నిలదొక్కుకోవడానికీ, ప్రాంతీయ పార్టీలకు దిక్సూచి కావడానికి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టి ఆర్ వేసిన బలమైన పునాదే ప్రధాన కారణం.
కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి,రాజకీయ అస్థిరతతో విసుగెత్తిన ప్రజానీకం ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న వేళ ప్రాంతీయ పార్టీని ఎన్టీఆర్ నెలకొల్పినప్పుడు ఇది కూడా ఉత్తరాది పార్టీల మాదిరిగానే, మఖలోపుట్టి పుబ్బలో పోతుందని వ్యాఖ్యానించిన వారున్నారు.సినీరంగంలో రాణించిన వ్యక్తి రాజకీయ రంగంలోరాణించలేరంటూ ఎద్దేవా చేసినవారున్నారు.
తెలుగుదేశం పార్టీ రాజకీయాల దిశనూ,దశనూ మార్చింది. పేరుకి ప్రాంతీయ పార్టీ అయినా, రాష్ట్రాల సమస్యలపై కేంద్రంతో పోరాటం సాగించి జాతీయ స్థాయిలో ఆనాడే పేరు తెచ్చుకుంది. ప్రాంతీయ పార్టీలు కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించగలవని తెలుగుదేశం రుజువు చేసింది.
ఎన్టీఆర్ అమలు జేసిన సబ్సిడీ బియ్యం,సబ్సిడీ కరెంట్, వంటి పథకాలు తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదిగా రూపుదిద్దుకున్నాయి. మహిళలకు ఆస్తిలోసమాన వాటా,మహిళలకోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు, మహిళల స్వయం సహాయక గ్రూపుల ఏర్పాటు వంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్టీఆర్ చొరవ,కృషి ఫలితంగానే ప్రారంభమయ్యాయి.అవన్నీ తెలుగుదేశం పార్టీకి ఈనాటికీ పెట్టని కోటలుగా నిలుస్తున్నాయి. కులవృత్తులు నశించకుండా ఆదరణ పథకం, వంటగ్యాస్ సరఫరాకోసం దీపం పథకం వంటి ఎన్నో పథకాలు తెలుగుదేశం పార్టీకి ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని కల్పించాయి. ఎన్టీఆర్ పేరిట ట్రస్టు ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలనూ, బ్లడ్బ్యాంకునూ నిర్వహిస్తున్నారు.ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ నిర్వహిస్తున్నారు.పేద విద్యార్ధులకు ఉపకారవేతనాలు ఇస్తున్నారు.
ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం నిలదొక్కుకుని,జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర పార్టీల కూటమిలో ప్రధాన పాత్ర వహించడానికి ఆనాడు ఎన్టీఆర్ చూపిన మార్గమే దిక్సూచిగా పనిచేస్తోంది. చెప్పింది చేసి చూపడం వల్లనే ఎన్టీఆర్పైనా, తెలుగుదేశంపైనా జనంలో విశ్వసనీయత పెరిగింది. దశాబ్దాలుగా రాజకీయ రంగస్థలంపై నిలబడగలిగింది.
పేరుకి ప్రాంతీయ పార్టీ అయినా, ప్రాంతీయ దురభిమానాన్ని ఏ కోశానా ప్రదర్శించకుండా, జాతీయ ప్రయోజనాల కోసం నిరంతరం పాటుపడుతున్న పార్టీగా తెలుగుదేశం పేరొందింది.
కొత్త రాజకీయ సంస్కృతినీ, రాజకీయాల్లో కొత్త ఒరవడిని తెలుగుదేశం పార్టీ సృష్టించింది. కేంద్ర,రాష్ట్ర సంబంధాలకు కొత్త రూపాన్ని తెచ్చింది.ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెత్తనం స్ధానంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కేంద్రానికి నేర్పించగలిగింది. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపర్చేయత్నాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ సాగించిన అలుపెరగని పోరాటం ఫలితంగానే సర్కారియాకమిషన్ ఏర్పడింది. వీటన్నిటి ఫలితంగా మారిన రాజకీయ వాతావరణం వల్లే ఎన్ టి ఆర్ ఆతరువాత చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఒక దశలో దేశ ప్రధానిని ఖరారు చేయగల ఉన్నతమైన బాధ్యతను కూడా తెలుగుదేశం నెత్తికెత్తుకుంది.
ఒక ప్రాంతీయ పార్టీకి ఆప్రాంత ప్రయోజనాలతో పాటు ఒక సైద్ధాంతిక దృక్పధాన్ని కూడా ఎన్ టి ఆర్ ఇవ్వడం వల్లే ఇదంతా సాధ్యమైంది.
35 ఏళ్ళలో చాలా మార్పులు వచ్చాయి. ఎంతో అభివృద్ధి జరిగింది. కొత్త సమస్యలు వచ్చాయి. ఉద్వేగభరితుడూ, ఆవేశపూరితుడూ అయిన ఎన్ టి ఆర్ స్ధానంలో అత్యంత సమర్ధుడైన ఆర్గనైజర్ చంద్రబాబు నాయుడు నాయకుడయ్యారు. రాష్ట్రం విడిపోయింది.
సంస్కరణలద్వారా గుజరాత్ రూపురెఖల్నే మార్చిన నరేంద్రమోదీ అంటే చంద్రబాబుకి ఎంతో ప్రీతిపాత్రం. ఎందుకంటే ఆర్ధిక సంస్కరణల్లో మోదీది, బాబుదీ ఒకే మతం! ఒకే సిద్ధాంతం!! ఒకే దార్శనికత్వం!!! విభజన హామీలను కేంద్రం గాలికి వొదిలేసినా, విభజన చట్టంలో రాష్ట్రాన్ని ఆదుకునే అంశాల్ని కేంద్రం పాతిపెట్టేస్తున్నా, నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నిలదీయలేక పోడానికి బహుశ ఇదేకారణం కావచ్చు.
పోరాటవైఖరి ద్వారానే ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ఎన్ టి ఆర్ దేశవ్యాప్తంగా చాటారు. చంద్రబాబు రెండేళ్ళ ఓర్పు, సహనం, సర్దుబాటు వైఖరి రాష్ట్రానికి అదనపు ప్రయోజనాలు ఏమీ తెచ్చిపెట్టలేకపోయింది. రాజధాని నిర్మాణంతో సహా మరే రాష్ట్రానికీ లేని ఆర్ధిక సమస్యలతో సతమతమౌతున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు డిల్లీ వెళ్ళిన ప్రతీసారీ వొట్టి చేతులతో వెనక్కి వస్తూ
అవమానం పాలౌతున్న పరిస్ధితి – తెలుగుదేశం మౌలిక సిద్ధాంతమైన ఆత్మగౌరవానికి ప్రశ్నార్ధకమైంది.
ప్రకటించిన కార్యక్రమాలన్నిటికీ ఏద విధంగా వనరులు చూపిస్తూ తాను నిరాశ పడకుండా, ప్రజల్లో ఆశ చావకుండా నెట్టుకొస్తున్న చంద్రబాబు ఓర్పూ సహనాలు ఎన్ టి ఆర్ కు లేవు. సర్వం తానే అయి తెలుగుదేశాన్ని నడిపిస్తున్న చంద్రబాబు స్వభావాన్ని బట్టే పార్టీ ఇప్పటిలాగే కొనసాగుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ 35 ఏళ్ళలో తన స్వభావాన్ని ఎమోషన్ నుంచి ఆర్గనైజర్ గా మార్చేసుకుంది.