ఝార్ఖండ్ లో కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ కు కష్టం వచ్చింది. ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు . అక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఉండటంతో కాంగ్రెస్ ధీమాగా ఉంది. గతంలో ఇలాంటి బాధ్యతలను ఎక్కువగా డీకే శివకుమార్ కు అప్పగించేవారు. ఈ సారి రేవంత్ కూడా హైకమాండ్ కు ఓ ఆప్షన్ గా కనిపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ లో పెరిగిన ఆయన పలుకుబడికి నిదర్శనమంటున్నారు.
ఝార్ఖండ్ ముఖ్యమంత్రిని ఈడీ అరెస్టు చేయడంతో అక్కడ ప్రభుత్వం మారింది. కొత్త సీఎం ప్రమాణం చేశారు. బలపరీక్ష నిర్వహించుకునేందుకు సమయం ఉండటంతో బీజేపీ ట్రాప్ లో పడకుండా 36 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. వీరందర్నీ షామీర్ పేటలోని ఓ రిసార్టులో ఉంచారు. ప్రతి నలుగురు ఎమ్మెల్యేలకు ఒక టేకర్‌ను తెలంగాణ కాంగ్రెస్ నియమించింది. ఫిబ్రవరి 5 ఉదయం 7 గంటల వరకు లియోనియా రిసార్ట్‌లోనే ఉండనున్న ఎమ్మెల్యేలు.. ఫిబ్రవరి ఐదో తేదీన స్పెషల్ ఫ్లైట్‌లో రాంచీ వెళ్లనున్నారు.
ఝార్ఖండ్‌లో అసెంబ్లీలో 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజార్టీ నిరూపించుకునేందుకు 41 మంది సభ్యుల మద్దతు కావాలి. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 48 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు బీజేపీ పంజా విసురుతుతుంది. అందుకే కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది. ఝార్ఖండ్ ఎమ్మెల్యేల రాక సందర్భంగా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఎవరూ ఎమ్మెల్యేలతో టచ్ లోకి రాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు.