ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఒక్క రోజులో.. 3963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాదు.. మరణాలు .. 52 నమోదయ్యాయి. 23, 872 శాంపిల్స్ పరీక్షిస్తే అందులో దాదాపుగా నాలుగు వేల మందికి పాజిటివ్ వచ్చింది. ఈ అంకెలు అధికారవర్గాలను సైతం భయ పెడుతున్నాయి. జిల్లాల్లో భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క రోజే.. 994 కేసులు నమోదవడం… తీవ్రతకు అద్దం పడుతోంది. కర్నూలు జిల్లాలో 550 కేసులు నమోదయ్యాయి. ప్రతీ జిల్లాలోనూ కనీసం వంద కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి చూస్తే.. ఏపీలో సామాజిక వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందన్న అభిప్రాయం.. వైద్య వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
నమోదవుతున్న పాజిటివ్ కేసులన్నీ.. ఏపీలో ఉన్న వారివే. వలస కార్మికులవి.. విదేశాల నుంచి వచ్చిన వారివి కాదు. మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూండటంతో… వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని.. ఆక్సీజన్ యూనిట్లు.. వెంటిలేటర్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతోంది కానీ.. ఇవన్నీ.. మరణాల రేటును తగ్గించలేకపోతున్నాయి. గత వారం రోజుల నుంచి రోజుకు.. 40కిపైగా మరణాలు నమోదయ్యేవి.. ఇప్పుడు అవి యాభై దాటిపోయాయి. మరణాలు రేటు.. చాలా ఎక్కువగా ఉండటం కూడా.. అధికార వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.
నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిహద్దులను.. మూసి వేసింది. పాస్లు ఉండి.. పక్కాగా పరీక్షలు చేయించుకున్న వారినే అనుమతిస్తోంది. అయితే అలా వస్తున్న వారి కన్నా… అంతర్గతంగానే వైరస్ పాకిపోతోంది. చాలా చోట్ల.. కట్టడి ప్రాంతాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీలైనంత వరకు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ.. కేసులు మాత్రం ఆగడం లేదు. పైగా.. పల్లె ప్రాంతాల్లో వైరస్ విజృంభిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో.. దేశంలో ఇతర చోట్ల వైరస్ విస్తరిస్తూంటే.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పల్లె ప్రాంతాల్లో విశ్వరూపం ప్రదర్శిస్తోంది.