తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ స్వామిగౌడ్ అనర్హతా వేటు వేశారు. నిజామాబాద్ కు చెందిన భూపతి రెడ్డి, మెదక్ జిల్లాకు చెందిన రాములు నాయక్, రంగారెడ్డి జిల్లాకు చెందిన యాదవరెడ్డి అనర్హతా వేటుకు గురైన వారిలో ఉన్నారు. వీరిలో భూపతిరెడ్డి, యాదవరెడ్డి టీఆర్ఎస్ తరపున ఎన్నికయ్యారు. కానీ రాములు నాయక్.. సామాజిక సేవ కేటగిరిలో గవర్నర్ నామినేట్ చేశారు. అయినప్పటికీ.. ఆయనపై ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేసి… అనర్హతా వేటు వేశారు. పార్టీ ఫిరాయించిన మరో ఎమ్మెల్సీ కొండా మురళీ కొద్ది రోజుల కిందటే రాజీనామా చేయడంతో… ఆయనపై … టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసినా.. ప్రయోజనం లేకుండా పోయింది.
నిజానికి ఎన్నికలకు ముందు చాలా పరిమితంగా మాత్రమే టీఆర్ఎస్ నుంచి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ… కాంగ్రెస్, టీడీపీల నుంచి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. చివరికి 2014 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అప్పట్లో పదుల సార్లు అటు స్పీకర్ కు .. ఇటు మండలి చైర్మన్ కు… కాంగ్రెస్ , టీడీపీ నేతలు మార్చి మార్చి ఫిర్యాదు చేసినా.. కోర్టుకు వెళ్లినా… ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరికి వారందరినీ .. విలీనం చేస్తున్నట్లు నోటిఫికేషన్లు రిలీజ్ చేసేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిపై అనర్హతా వేటు వేసేశారు.
చివరికి ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇద్దరు ఎమ్మెల్సీను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. వారిపై ఇచ్చిన ఫిర్యాదులను.. విలీనం పేరుతో తోసి పుచ్చారు మండిల చైర్మన్. ఇప్పుడు… వారు ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది. త్వరలో టీడీపీకి చెందిన ఇద్దర్నీ.. కాంగ్రెస్ కు చెందిన ఎనిమిది మందిని పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు.. చర్చలు జరుపుతున్నారు. ఎవరు చేరినా.. కొంత మందికి మంత్రి పదవులు వస్తాయంటున్నారు. ఎలా చూసినా.. వారిపై.. ఫిర్యాదులు అంటూ వెళ్తే… నిర్ణయం తీసుకోవడం మాత్రం ఉండదు. ఎందుకంటే.. వారు టీఆర్ఎస్ లో చేరారు కదా….!