ఈ నెల పధ్నాలుగో తేదీన ఢిల్లీలో ఓ మతపరమైన కార్యక్రమం జరిగింది. దానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వెళ్లారు. వచ్చారు. అలా వచ్చిన వారంతా ఉత్తినే రాలేదు. తమతో పాటు కరోనా వైరస్‌ను తీసుకొచ్చారు. ఒకరికో.., ఇద్దరికో వస్తే.. ఎయిర్ పోర్టులోనే.. మరో చోట వచ్చందని అనుకోవచ్చు. కానీ టెస్టులు చేసినా ప్రతి ఇద్దరిలోనూ ఒకరికి వైరస్ బయటపడుతోంది. గుంటూరులో ఓ ప్రజాప్రతినిధి బంధువు ఆ మత సమ్మేళనానికి వెళ్లి .. వచ్చి పలువురుకి అంటించారు. అదే మత సమ్మేళనానికి వెళ్లిన ప్రకాశం జిల్లా వారికి కూడా వైరస్ వచ్చింది. తెలంగాణలో కరోనాతో చనిపోయిన వృద్ధుడు కూడా.. ఆ మత సమ్మేళనానికే వెళ్లారు. పాతబస్తీలో ఒకే ఇంట్లో ఆరుగురికి వైరస్ సోకింది.. వారు కూడా ఈ సమ్మేళనానికి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది.
దేశంలో మార్చి ఫద్నాలుగో తేదీకి కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభం కాలేదు. అప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ కు తరలిస్తున్నారు. అలాంటి సమయంలో.. ఢిల్లీలో జరిగిన ఈ మత సమ్మేళనంలో పాల్గొన్నవారిలో అత్యధిక మందికి వైరస్ సోకడం అధికారవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విదేశాల నుంచి కరోనా వైరస్‌తో వచ్చిన వారి కుటుంబసభ్యులందరికీ సోకని ఉదాహరణలు ఉన్నాయి. అత్యంత సన్నిహితంగా ఉంటే మాత్రమే.. ఈ వైరస్ కాంటాక్ట్ కేసు నమోదవుతోంది.
అలాంటిది… మత కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఎలా అంటుకుందన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మారింది. ఇప్పుడు… తెలుగు రాష్ట్రాల అధికారులు ఆ మత కార్యక్రమంలో పాల్గొన్న వారందర్నీ ట్రేస్ చేసి.. క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉంటే.. ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఆ మత కార్యక్రమం మిస్టరీ ఏమిటో తేల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.