సోనియా, రాహుల్ ల నాయకత్వంలో కాంగ్రెస్ భవిష్యత్తు పట్ల ఆపార్టీ సీనియర్ నాయకుల్లో ఆందోళన విస్తరిస్తోంది.అధినాయకత్వం వైఫల్యాల వల్ల సొంత భవిష్యత్తు శూన్యం కాకూడదన్న ఆలోచన కనీసం నలుగురు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులను సొంతంగా ప్రాంతీయ పార్టీలను నలకొల్పే దిశగా నడిపిస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి, సమావేశాలు జరుగకుండా స్తంభింప చేయడం ద్వారా విజయం సాధించినట్టు భావిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వానికి ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు.
పంజాబ్ లో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్, హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి బి యస్ హూడా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ , హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ప్రాంతీయపార్టీలు స్ధాపించే ఆలోచనల్లో వున్నారు.
లోక్ సభ స్పీకర్ 25 మంది కాంగ్రెస్ సభ్యులను ఇదు రోజులపాటు సభ నుండి బహిష్కరించినప్పుడు, ఆ తరువాత పార్టీ సభ్యులు పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శనలను పార్టీ అద్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా నాయకత్వం వహించి చేపట్టారు. తొలిసారిగా ఆమె బిగ్గరగా నినాదాలు ఇచ్చారు. స్పీకర్ వెల్ వరకు వెళ్ళి ఆమె ఆగ్రహాన్ని చూపించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీకి లోక్ సభలో డిప్యూటీ లీడర్ అయిన కెప్టెన్ అమరిందర్ సింగ్ పాల్గొనక పోవడం గమనార్హం. ఆ సమయంలో పంజాబ్ లో రెండవ దశ ర్యాలీ లను ఏర్పాటు చేసే సన్నహాలల్లొ ఆయన బిజీగా ఉన్నారు. 2017 లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుండే దృష్టి కేంద్రికరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తనకు నాయకత్వం ప్రకటించని పక్షంలో కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసి, బిజెపి తో కలసి పోటీ చేయడానికి ఆయన సిద్దపడుతున్నట్లు తెలుస్తున్నది. తనకు పోటీగా పంజాబ్‌కు చెందిన రవనీత్ సింగ్ బిట్టు కు రాహుల్ గాంధీ ప్రాధాన్యత ఇస్తూ ఉండడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారు.
అవినీతి ఆరోపణలపై బిజెపి మంత్రులు, ముఖ్యమంత్రులను రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్తో ముందుగా రాజీనామా చేయించాలని తొలుత భావించింది. అయితే అందుకు ఆయన సిద్దపడక పోగా, రాజీనామా చేయమంటే పార్టీ నుండి వెళ్ళిపోయి ప్రాంతీయ పార్టీ పెడతానని హెచ్చరించారు.
సోనియా గాంధీ నాయకత్వం పట్ల విధేయంగా వుంటూనే స్వతంత్రంగా వ్యవహిరించే ధోరణి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖరరెడ్డితోనే ప్రారంభమైంది. రాష్ట్రవిభజన అనంతర పరిణామాల్లో అప్పటి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిపోగా మల్లాది విష్ణు మరికొందరు ప్రముఖులు అటువైపే చూస్తున్నారు. కన్నాలక్షీ్మనారాయణ వంటి సీనియర్లు బిజెపిలో చేరిపోయారు. కాంగ్రెస్సే లేని రాష్ట్రం కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ లో ఆపార్టీ నుంచి ఇతరపార్టీలకు వలసలను తిరుగుబాటు అనలేము. అది కూలిపోయిన సౌధం నుంచి బయటపడుతున్నవారు ఎవరి దారి వారే చూసుకోవడం అవుతుంది.