తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించినా… రాజకీయాల్లో ఢాక్కమొక్కీలు తిన్న నలుగురు నేతలు మంత్రులుగా ఉండి మరీ పరాజయం పాలయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి, చందూలాల్, జూపల్లి కృష్ణారావుతో పాటు స్పీకర్ మధుసూధనా చారి కూడా పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీలో నిలిచిన తుమ్మల నాగేశ్వరరరావు… ఓడిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ… కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తుమ్మల చొరవ చూపించనప్పటికీ …. క్షేత్ర స్థాయి కార్యకర్తలకు తుమ్మల అందుబాటులో ఉండరన్న కారణంగా ఓడిపోయారు. నిజానికి పాలేరు నుంచి ఆయన గత ఉపఎన్నికల్లోనే పోటీ చేశారు. ప్రతీసారి అక్కడ రెడ్డి సామాజికవర్గం అభ్యర్థే విజయం సాధిస్తూ ఉంటారు. ఈ సారి కూడా అదే జరిగింది.
మరో మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి కూడా ఎదురుగాలే వీచింది. తాండూరు నుంచి పోటీ చేసిన ఆయన… పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో మూడు వేల ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహేందర్ రెడ్డిని ఓడించడంలో.. రోహిత్ రెడ్డిని గెలిపించడంలో విశ్వేశ్వర్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్న ప్రచారం జరుగుతోంది. పైగా విజయంపై అతి ధీమాతో.. మహేందర్ రెడ్డి.. పెద్దగా ఎలక్షనీరింగ్ పై దృష్టి పెట్టలేదని చెబుతున్నారు. రోహిత్ రెడ్డి ఆరు నెలల కిందట వరకూ టీఆర్ఎస్లోనే ఉండేవారు. మహేందర్ రెడ్డినే సస్పెండ్ చేయించారు. ఆయనే ఓడగొట్టారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావుకు కూడా ఓటమే ఎదురైంది. 1999 నుంచి కొల్లాపూర్ నుంచి విజయం సాధిస్తూ వచ్చిన జూపల్లికి ఈసారి షాక్ తగిలింది. కొందరు పార్టీ నేతలే తనను ఓడించారని ఆయన బాధపడుతున్నారు.
ములుగులో మంత్రి చందూలాల్ ఓడిపోతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క దాదాపు 20వేల మెజారిటీతో విజయం సాధించారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల కారణంగానే చందూలాల్ పరాజయం పాలయ్యారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. అలాగే… భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్పీకర్ మధుసూధనా చారి ఓటమి పాలయ్యారు. కుమారుల తీరు వల్లే మధుసూధనా చారి పరాజయం పాలయ్యారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ కేడర్ కూడా ఆ ముగ్గురిపై తీవ్ర అసంతృప్తితో ఉండటంతో ఆయన మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. స్పీకర్ గా ఉన్న వారు.. గెలవరనే సెంటిమెంట్ మరోసారి నిజం అయింది.