ముందస్తు సమరభేరీ మోగించి.. టిక్కెట్లు కూడా ఖరారు చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తనపై… తన పార్టీపై వస్తున్న ప్రధానమైన విమర్శను మాత్రం…తొలగించుకునే ప్రయత్నం చేయలేదు. అదే మహిళలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం. తెలంగాణ మంత్రివర్గంలో మహిళకు అవకాశం లేదు. నిజంగా.. దేశంలోని ఇతర రాష్ట్రంలోనూ ఇలా మహిళలు లేని మంత్రివర్గం ఉండదేమో..?. గెలిచిన వాళ్లు లేకపోతే.. ఎమ్మెల్సీ చేసి అయినా.. ఆ మాత్రం సమానత్వం పాటించాలని చాలా మంది భావిస్తూంటారు. కానీ ఈ విషయంలో కేసీఆర్ మాత్రం… లైట్ తీసుకున్నారు. చివరికి మహిళా శిశు సంక్షమ శాఖను కూడా.. మగ మంత్రే నిర్వహించారు. కేసీఆర్ కుమార్తె కవిత.. పలుమార్లు మంత్రివర్గంలోని మహిళలను తీసుకుంటారని.. రెండేళ్ల కిందటి వరకూ ప్రకటించారు. కానీ తర్వాత సైలెంటయిపోయారు.
కనీసం వచ్చే సారి అయినా.. మహిళలకు ప్రాధాన్యం లభిస్తుందని.. ఆ పార్టీ నేతలు ఆశించారు. కానీ కేసీఆర్.. ప్రకటించిన టిక్కెట్ల జాబితా చూసి.. నివ్వెర పోవాల్సి వచ్చింది. ఎందుకంటే… సిట్టింగుల్లో నలుగురికి మాత్రమే టిక్కెట్లు ఖరారు చేశారు. కొత్తగా ఎవరికీ ఇవ్వకపోగా… కొండా సురేఖ, బొడిగే శోభలను పెండింగ్‌లో పెట్టారు. మొత్తంగా చూస్తే.. నలుగురంటే నలుగురు మహిళలు మాత్రమే.. 105 మంది లిస్టులో ఉన్నారు. ఆలేరు నుంచి గొంగిడి సునీత, ఖానాపూర్ నుంచి రేఖా నాయక్, అసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి , మెదక్ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి మళ్లీ బరిలోఉంటున్నారు. ఇంకా పధ్నాలుగు సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ఒకటో, రెండో సీట్లలో మహిళా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే..మహా ఐదు.. ఐదారుగురు మాత్రమే టీఆర్ఎస్ తరపున ఎన్నికల బరిలో మహిళలు ఉంటారన్న మాట.
33శాతం రిజర్వేషన్ల కోసం మహిళలు పోరాడుతున్న దేశంలో.. ఇలా ఓ రాజకీయ పార్టీ.. మహిళా నాలుగు, ఐదు శాతంలోపే సీట్లను కేటాయించడం చాలా అరుదు. ఎందుకంటే.. మహిళా సెంటిమెంట్ చాలా బలమైనది. తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన వారిలో వస్తే… మొత్తానికే మోసం వస్తుంది. ఓటర్లలో సగం మంది మహిళలే ఉంటారు. నిజానికి మహిళలు… కులం, మతం, ప్రాంతం ప్రాతిపదిన ఓటింగ్‌లో ప్రభావితం గరయ్యేది చాలా తక్కువ. వారిని ప్రభావితం చేసే అంశాలు విడిగా ఉంటాయి. అలాంటి అంశాల్లో ఇప్పుడు మహిళలకు కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత అంశం వచ్చిందంటే… టీఆర్ఎస్కు ఇబ్బందికరమే. మరి దీన్ని కేసీఆర్ కుమార్తె కవిత కవర్ చేసే బాధ్యత తీసుకుంటారేమో..?