2014 ఎన్నికలకు ముందు.. నరేంద్రమోదీ అంటే దేశ రక్షకుడు. అమెరికా డాలర్‌ని రూపాయికి సమానంగా తెస్తాడన్నారు. దేశాన్ని అమెరికాను దాటించేయగలడన్నారు. అవినీతి పరుల్ని తరిమికొడతారన్నారు. బ్లాక్‌మనీని ఇట్టే తీసుకొస్తాడన్నారు. పెట్రో ధరల్ని నియంత్రించేస్తాడన్నారు. విద్య, ఉద్యోగాలు ఇలా అన్ని రంగాల్లో స్వర్ణయుగమేనన్నారు. చెప్పినంత కాకపోయినా..ఎంతో కొంత చేస్తారని ప్రజలు నమ్మారు. అదే సమయంలో యూపీఏ -2 ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. అవినీతి ఆరోపణలు, పెట్రో ధరలతో ప్రజలలో అసంతృప్తి. దీంతో మోదీ మానియా.. దేశం మొత్తం కమ్మేసింది. బీజేపీకి చరిత్రలో తొలి సారి పూర్తి మెజార్టీ వచ్చింది.
కానీ… నరేంద్రమోదీ పనితీరు.. ప్రచారం చేసిన దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. మోదీ పరిపాలనా విధానాలు సామాన్యుడి జీవితంపైనే దెబ్బకొట్టాయి. ఒక దేశం.. ఒకే పన్ను అంటూ జీఎస్టీ తెచ్చారు. కానీ జీఎస్టీ పేరుతో ప్రతీ వస్తువు ధరను పెంచేశారు. జీఎస్టీ లేని వస్తువుల.. ధరలు కూడా పెరగడం… మధ్యతరగతి జీవుల్లో అసంతృప్తి రగిల్చింది. ఇక నోట్ల రద్దు… దేశంలో 130 కోట్ల మంది ఉంటే.. ప్రతి ఒక్కరిపైనా డైరక్ట్ ఎఫెక్ట్ పడింది. దాని ప్రయోజనాలు ఏమీ లేవని తెలిసిన తర్వాత ప్రజల ఆగ్రహం మరింత పెరిగింది. ఇక పెట్రోల్, డీజిల్ రేట్లు. అధికారంలోకి రాక ముందు యూపీఏపై ప్రజలను రెచ్చగొట్టడానికి ఎన్నో ట్వీట్లు, ప్రకటనలు చేసిన మోదీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కన్నా ఎక్కువగా… రెండు లక్షల కోట్లను ప్రజల వద్ద నుంచి పిండుతున్నారు. దానికి దేశభక్తి ముసుగేస్తున్నారు.
గత ఎన్నికల్లో ఏ వర్గాలైతే బీజేపీకి బాసటగా నిలిచాయో అవే వర్గాలు ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మధ్య తరగతి బీజేపీకి పెద్ద ఓటు బ్యాంకు. కానీ బ్యాంకుల సంక్షోభం, నోట్ల రద్దు వల్ల తలెత్తిన పరిణామాలు, పెట్రో ధరల పెరగుదల, నిత్యావసరాల పెరుగుదల, సామాజిక అశాంతి… ఇవన్నీ ఆ వర్గాన్ని దూరం చేశాయి.
భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు.. ఓ మాదిరిగా ఉన్నా అట్టర్ ఫ్లాపవుతాయి. ఎందుకంటే.. సినిమాను చూడటానికి వచ్చే వాళ్లు ఎంతో ఊహించుకుంటారు. ఊహించుకున్నంత సినిమాలో ఉండదు. ఫలితంగా.. ఓ మాదిరిగా ఉన్నా కూడా బాగోలేదనే చెబుతారు. అలాగే అంతులేని అంచనాలు పెంచేసుకుని అధికారంలోకి వచ్చిన మోదీ.. ఓ మాదిరిగా కూడా తన పరిపాలనా సామర్థ్యాన్ని చూపించలేకపోయారు. ఫలితంగా… అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చేసింది. అసంతృప్తిని రగిల్చి, ఆశలను కుప్పకూల్చిన కాషాయ సేనకు మళ్లీ అందలమెక్కే అర్హత లేదని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.