ఏపీలో ఇవాళ్ల ప్రత్యేక హోదా పేరుతో ప్రజలు ఉద్యమిస్తున్నారంటే దానికి కారణం నాలుగేళ్లుగా జగన్ చేసిన అలుపెరుగని పోరాటమే అనేది వైకాపా నేతల నమ్మకం..! వాస్తవం మాట్లాడుకుంటే, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ ఎంపీలు నిలదీసిన తరువాతే హోదాతోపాటు రాష్ట్ర ప్రయోజనాల విషయమై కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. అన్యాయం చేసిన కేంద్రాన్ని వదిలేసి, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది వైకాపా నేతల దినచర్య! తాజాగా, వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్ మరోసారి సీఎంపై విమర్శలు చేశారు. గత నాలుగేళ్లలో హోదాతో సహా ముఖ్యమైన విషయాలను చంద్రబాబు పట్టించుకున్న పాపానపోలేదని ఆయన విమర్శించారు.
జగన్ నేతృత్వంలో వైకాపా పోరాటం చేస్తోంది కాబట్టే, కేంద్రం అన్యాయం చేసిందంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. విశాఖ రైల్వేజోన్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్టాంట్… ఇలాంటి ముఖ్యమైన అంశాలను కేంద్రం పట్టించుకోకపోతే, నాలుగేళ్లయిన తరువాత ఇప్పుడు చంద్రబాబు పోరాటం అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మోడీ పరిస్థితి బాగులేదనీ, రాష్ట్రంలో తన పరిస్థితి అంతకన్నా బాలేదనీ, ప్రజలు హోదాకోసం తిరుగబడుతున్నారనే విషయం తెలుసుకున్నాక చంద్రబాబు ఇప్పుడు పోరాటం అంటున్నారన్నారు. హోదాపై ఎక్కడాలేని చైతన్యాన్ని జగన్ తీసుకొచ్చారన్నారు. ప్రజలందరూ జగన్ వెంట నడుస్తున్నారని మేకపాటి చెప్పారు!
సరే, మేకపాటి విశ్లేషణ ప్రకారం… ఈరోజున ఏపీలో ప్రత్యేక హోదాపై ప్రజలు ఎమోషనల్ గా ఉన్నారంటే అది జగన్ నాలుగేళ్లుగా కల్పించిన చైతన్యమే అనుకుందాం కాసేపు! మరి, హోదా పాటుగా కేంద్రం ఇవ్వలేదని ఆయనే చెబుతున్న.. రైల్వేజోన్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, పారిశ్రామిక కారిడార్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాట్ వంటి ముఖ్యమైన అంశాలపై జగన్ మాట్లాడారా..? వీటి గురించి నాలుగేళ్లుగా జగన్ చాలా ప్రయత్నించారని చెప్పగలరా..?
సంతోషం ఏంటంటే… ఈరోజున వీటి గురించి కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారూ, చైతన్యవంతులు అవుతున్నారంటే దానికీ కారణం జగన్ చేసిన నాలుగేళ్ల అలుపెరుగని పోరాటమని చెప్పలేదు! ఏమో, కొద్దిరోజులు పోతే… వీటిపై కూడా ఈరోజున కేంద్రాన్ని టీడీపీ నిలదీస్తోందంటే దానికి కారణం జగనే అనేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. విచిత్రం ఏంటంటే… ఏపీ ప్రయోజనాల అంశమై కేంద్రంతో వైకాపా నేరుగా ఏ పోరాటమూ చెయ్యదు. కానీ, కేంద్రంతో టీడీపీ చేస్తున్న పోరాటానికి కారణం తామే అని చెప్పుకుంటూ ఉండటం!