తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏపీతో పాటు విదేశాల్లో తెలుగువారు ఉన్నచోట కూడా ఘనంగా జరిగింది. ఉదయం నుంచి తీరిక లేకుండా కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు యువత ఉత్సాహం నచ్చిందేమో కానీ.. సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కీలక ప్రకటన చేశారు. నలభై శాతం టిక్కెట్లు యువతకే కేటాయిస్తామని ప్రకటించారు. యువత ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యువత పోరాడితేనే ఏదైనా సాధ్యమన్నారు. వ్యవస్థలో మార్పు తేవాలనుకునే యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
టీడీపీలో ఎన్టీఆర్ టైంలో ఉన్న నేతలే ఇప్పటికీ చక్రం తిప్పుతున్నారు. తర్వాత యువనాయకత్వాన్ని అంత గొప్పగా ఎదగనీయలేదు. ఇప్పుడు యువ నేతల అవసరాన్ని చంద్రబాబు గుర్తించారు. అనివార్యంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిన రామ్మోహన్ నాయుడు లాంటి వారు తమదైన ముద్ర వేసి టీడీపీకి చాలా భవిష్యత్ ఉందని నిరూపిస్తున్నారు. అలాగే టీడీపీ నేతల వారసుల్లో చాలా మంది చురుకైన వారు ఉన్నారు. వారికి అవకాశాలతోపాటు ఈ సారి పార్టీ కోసం కష్టపడిన యువతకు చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో పార్టీకి యువత దూరం అయిందన్న అభిప్రాయం వినిపించింది. అభివృద్ది కేంద్రరాజకీయాలు చేస్తున్నా.. యువతకు దగ్గర కాలేకపోవడానికి యువ నాయకత్వ కొరతే కారణమని అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు మాటలతో చెప్పిన విషయాన్నిచేతల్లో కూడా చూపించి.. సమర్థులైన యువ నాయకత్వాన్ని వెలికి తీస్తే.. టీడీపీకి అదే ఉజ్వలమైన భవిష్యత్‌ను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు.