తెలంగాణ ప్రభుత్వం అత్యంత ఖరీదైన భూముల్ని వేలానికి పెడుతోంది. 400 ఎకరాలను లే అవుట్ వేసి వేలం ప్రక్రియ ద్వారా అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆషామాషీగా అమ్మాలనుకోవడం లేదు. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించి .. కనీసం వేలకోట్ల ఆదాయం వచ్చేలా అమ్మాలని అనుకుంటోంది. ఇందు కోసం టీజీఐఐసీ కన్సల్టెంట్లను ఆహ్వానించింది.
శేర్లింగంపల్లిలో 400 ఎకరాల భూములున్నాయి. ఇవన్నీ గతంలో ఐఎంజీ సంస్థకు ఇచ్చిన భూములు. ఆ సంస్థపై కేసులు పెట్టడంతో ప్రతిపాదనలు అమల్లోకి రాలేదు. ఆ భూముల్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు కోర్టు కేసులు కూడా క్లియర్ అయ్యాయి. ఈ భూములు హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు అతి సమీపంలో ఉంటాయి. అందుకే వీటికి ఊహించనంత డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కన్సల్టెంట్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో లే అవుట్ అభివృద్ధి ప్రణాళికలను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. వేలం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన మొత్తం ఆదాయంలో 0.003 శాతాన్ని సదరు సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి ఈ భూములు ఆశాదీపంలా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు తమ అనుభవంతో.. ఈ భూములకు వాల్యూ యాడ్ చేసి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో భూములు ఎలా పడితే అలా వేలం వేయడం వల్ల ఓ మాదిరి ఆదాయం వస్తోంది. ఈ సారి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించి.. మల్టీనేషనల్ కంపెనీలు భూములు కొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.