హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో చేసిన సోదాల్లో రూ. నాలుగు వందల కోట్ల నల్లధనం గుర్తించినట్లుగా ఐటీ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో సంస్థ పేరు ఏమీ చెప్పలేదు . విషయం తెలిసినా తెలంగాణ మీడియా లో ప్రోఫైల్ మెయిన్ టెయిన్ చేసింది. ఆ కంపెనీల్లో చేసిన సోదాల్లో బోగస్ కంపెనీల ద్వారా ఈ కంపెనీ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. 1.66 కోట్ల రూపాయల నగదు, కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు ఇటీవల సోదాలు చేసిన కంపెనీ ఎంఎస్ఎన్ ఫార్మా. మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి చెందినది. నేరుగా ఫార్మాస్యూటికల్స్ తయారు చేయడం కన్నా.. ఫార్మా కంపెనీలకు ఇంటర్మీడియట్స్ సప్లై చేయడంలో ఈ కంపెనీ పేరు మోసింది. ఈ కంపెనీకి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సోదాల్లో ఈ అవకతవకలు గుర్తించారు.
బడా కంపెనీలపై అప్పుడప్పుడు ఐటీ దాడులు జరుగుతూ ఉంటాయి. అది మామూలే. కాకపోతే.. ఎక్కువగా ఇన్ ఫ్రా రంగంలో ఉన్న కంపెనీలపై గురిపెడుతూంటారు. ఈ సారి ఫార్మా కంపెనీపై దృష్టి పెట్టారు. అది ఓ సంచలనం అయితే.. అది టీఆర్ఎస్ ఎంపీకి చెందినది కావడం మరో సంచలనం. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నేతలు… టీఆర్ఎస్ పెద్దలకు చెందిన అత్యంత సన్నిహితులైన వారి కంపెనీలపై వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నారు. వందల కోట్ల బ్లాక్ మనీ లావాదేవీల్ని గుర్తించినట్లుగా చెబుతూనే ఉన్నారు. ఇవన్నీ.. అవసరమైనప్పుడు బయటకు తీసి ఉపయోగించుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.
టీఆర్ఎస్ను ఇటీవలి కాలంలో బీజేపీ టార్గెట్ చేసిందని చెబుతున్నారు. బెంగాల్లోనూ ఇలా టీఎంసీ నేతల్ని టార్గెట్ చేసి కొన్ని కేసులు నమోదు చేశారు. శారదా చిట్స్ సహా పలు కేసుల్ని నమోదు చేశారు. అన్నీ కేంద్ర సంస్థల కేసులే. ఆ తర్వాత వరుసగా ఒక్కొక్కర్ని టార్గెట్ చేశారు. ఇప్పుడుఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి.. వారంతా బీజేపీలో చేరిపోయారు. ఉన్న కొద్ది మందిపై ఎన్నికల సమయంలో సీబీఐ, ఐటీ, ఈడీలు నోటీసులు జారీచేస్తున్నాయి. వారు కూడా టీఎంసీ తరపున యాక్టివ్ గా ఉండకుండా చూసుకుంటున్నారు. తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అలాంటి వ్యూహాన్ని దీర్ఘకాలికంగా అమలు చేస్తోందన్న అనుమానం టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది.