2019 ఎన్నికల్లో భాజపాకి అవకాశం ఇవ్వకూడదనే ఐక్యత విపక్షాల్లో చాలా స్పష్టంగా ఉంది. యూపీ ఉప ఎన్నికల నుంచి కర్ణాటక ఫలితాల వరకూ… భాజపాకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాల కూటమి తెరమీదికి రాబోతోందన్న సంకేతాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇచ్చిన ఒక వ్యూహాత్మక ప్రణాళిక తెరమీదికి వచ్చిందంటూ జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం… దేశంలో 400 స్థానాలను గుర్తించారనీ, ఆయా స్థానాల్లో ముఖాముఖీ.. అంటే, భాజపాకి వ్యతిరేకంగా ఒకే ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టాలనీ, ఇతర పార్టీలు ఆ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనేది ఈ మహా ప్రణాళికగా చెబుతున్నారు. అంటే, ఒకే స్థానంలో భాజపాతో తలపడేందుకు బహుముఖ పోటీ లేకుండా చేయాలనేది ఈ వ్యూహం లక్ష్యం. దీనిపై చాలా పార్టీలు అనుకూలంగానే స్పందించిస్తున్నట్టు ఓ చర్చ జరుగుతోంది. వినడానికి ఇది పకడ్బందీ ప్లాన్ లా అనిపిస్తున్నా, వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇది సాధ్యమా అనేదే చర్చ!
రాష్ట్రాలవారీగా పార్టీల మధ్య ఐక్యత అనేదే ఇప్పుడు ముఖ్యమైంది. ఈ క్రమంలో చూసుకుంటే.. యూపీలో ఎస్పీ, బీఎస్పీల మధ్య సయోధ్య కుదిరేసింది. ముఖ్యమంత్రి వరకూ అఖిలేష్ కు మద్దతు ఇస్తే, ప్రధాని అభ్యర్థిగా మాయావతిని ప్రమోట్ చేసేందుకు ఎస్పీ సిద్ధంగా ఉందనే చెప్పొచ్చు. బీహార్ లో కూడా భాజపా పరిస్థితి ఇరకాటంలోనే పడబోతోందనీ, త్వరలో ముక్కలు తప్పదనే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ కూడా ప్రాంతీయ పార్టీల మధ్య సయోధ్యకు ఆస్కారం కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడులో పరిస్థితి ఓకే. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే… ఆంధ్రాలో భాజపాకి వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నా, వైకాపా, జనసేనలు చేతులు కలిసే పరిస్థితి అనూహ్యం. తెలంగాణలో భాజపా సోలోగా పోటీ అంటోంది. కానీ, ఇక్కడా ఆ పార్టీకి ఆశించిన స్థాయి ఫలితాలు అనుమానమే. ఇలా రాష్ట్రాలవారీగా చూసుకుంటే… కొన్ని చోట్ల భాజపాకి వ్యతిరేకంగా అందరూ కలిసే పరిస్థితి, కొన్ని చోట్ల అందుకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి.
కానీ, ఓవరాల్ గా ఎన్నికల వచ్చే నాటికి దాదాపు ప్రధాన పార్టీల మధ్య భాజపాకి వ్యతిరేకంగా ఒకటయ్యే సర్దుబాటుకు ఆస్కారం ఉండే అవకాశాలే ఎక్కువ. భాజపాకి వ్యతిరేకంగా 400 స్థానాల్లోనూ వన్ టు వన్ పోటీకి ఏకీకరణ అసాధ్యమని ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే, భాజపాకి అవకాశం ఇవ్వొద్దనే బలమైన లక్ష్యం ముందు అనూహ్యమైన కలయికలు సాధ్యమే. పైగా, దేశంలోని ప్రధాన పార్టీలన్నీ స్వచ్ఛందంగా ఒకే వేదికపైకి వచ్చిన పరిస్థితి కర్ణాటకలో చూశాం. కూటమికి అక్కడే పునాది పడిందనీ చెప్పొచ్చు. ఇలాంటప్పుడు, కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పోషించాలి. ప్రధాని కలల్ని రాహుల్ కాస్త పక్కనపెట్టాలి.
400 స్థానాల్లో భాజపాకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతుతో ఒకే అభ్యర్థిని నిలబెట్టాలనే వ్యూహానికి కాంగ్రెస్ కూడా మద్దతుగా నిలిస్తే బాగుంటుంది. మరి, ఆ దిశగా కాంగ్రెస్ చొరవ తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. అయితే, ఇక్కడ కాంగ్రెస్ నిర్ణయం ఈ వ్యూహాన్ని ప్రభావితం చేస్తుందనీ చెప్పలేం.ఎందుకంటే, ప్రాంతీయ పార్టీల వెంట నడవాల్సిన అవసరం కాంగ్రెస్ కి ఉంది. మొత్తానికి, 2019 ఎన్నికల్లో మరోసారి భాజపాకి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదనే ఒక బలమైన లక్ష్యం తెర మీదకు వచ్చిందనే చెప్పాలి.