నియోజకవర్గానికి రెండు కోట్లు ఇస్తాం… అభివృద్ధి చేయమని ఎమ్మెల్యేలకు చెబుతున్న సీఎం జగన్ తన నియోజకవర్గానికి మాత్రం అలాంటి పరిమితులు పెట్టుకోవడం లేదు. రూ. వేల కోట్ల పనుల మంజూరు చేస్తున్నారు. జీవోలిస్తున్నారు. తాజాగా మరో రూ. 407 కోట్ల పనులకు పాలనాపరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. డ్రైనేజీలు లాంటి మౌలిక వసతుల కోసం ఈ అనుమతిలిచ్చారు. ఇంత వరకూ ఓకే కానీ ఇప్పటి వరకూ ఇచ్చిన జీవోలకు ఎన్ని నిధులిచ్చారు..ఎన్ని పనులు చేస్తున్నారన్న దానిపై మాత్రం కనీస సమాచారం ఉండదు. కానీ పనులు జరుగుతున్నాయో లేదో కళ్ల ముందు కనిపిస్తుంది కాబట్టి.. ఏమీ ఇవ్వడం లేదని అనుకోవచ్చు.
పులివెందులకు జగన్ క్రిస్మస్ తో పాటు వైఎస్ జయంతికి వెళ్లేటప్పుడు జీవోల మీద జీవోలు వస్తూ ఉంటాయి. ఇలా కనీసం వంద జీవోలు రిలీజయి ఉంటాయని అంచనా. చాలా వరకూ సీక్రెట్‌గానే ఉంచారు. కానీ బయటకు మాత్రం ప్రకటించారు వెళ్లినప్పుడల్లా శంకుస్థాపనలు చేశారు. 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రి, వేంపల్లి సీహెచ్‌సీకి రూ.30 కోట్లు, పులివెందుల మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మెట్రో స్థాయిలో మిని శిల్పారామం, వైఎస్ఆర్ ఘాట్, గండి క్షేత్రం, గండికోట, ఒంటిమిట్ట ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ ,భారీ మాల్ మల్టిప్లెక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పులివెందుల బస్టాండ్ గురించి. గ్రాఫిక్స్ రిలీజ్ చేసి చాలా కాలం అయినా ఇంకా పునాది దాటలేదు.
ఒక్కటంటే ఒక్క పనీ ముందుకు సాగడం లేదు. శంకుస్థాపనలు శిలాఫలకాలకే పరిమితమవుతున్నాయి. ఇప్పుడుమరి కొన్ని పనులకు పాలనా అనుమతులు ఇచ్చారు. అవన్న ఎప్పటికి పూర్తవుతాయో.. ఎప్పుడు సీఎం జగన్ నిధులు విడుదల చేస్తారో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆర్థిక పరస్థితి రోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు పెట్టడం సాధ్యం కావడం లేదు.