చారిత్రక నేపథ్యమున్న కథలకు సాంకేతిక సొబగులు చాలా అవసరం. అందులోనూ కళా నైపుణ్యం మరింత కీలకం. వందల ఏళ్ల క్రితం కథ చెప్పాలంటే – సెట్స్‌పై ఆధారపడాల్సిందే. `సైరా` కూడా చారిత్రక గాథే. అందుకే సెట్స్‌కి చాలా పని పడింది. ఈ రంగంలో సుప్రసిద్ధుడిగా పేరు తెచ్చుకున్న రాజీవన్‌ని కళా దర్శకుడిగా ఎంచుకుంది `సైరా` టీమ్. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 42 సెట్లు వేశారు. 64 గ్రామాలకు పునఃసృష్టి చేశారు. బ్రిటీష్ కాలం నాటి తుపాకుల్ని, ఫిరంగుల్ని తయారు చేశారు. యుద్ధ సామాగ్రికి అయిన ఖర్చుతోనే ఏకంగా రెండు చిన్న సినిమాల్ని చేయొచ్చని చెబుతున్నారు రాజీవన్. కేవలం సెట్స్‌కోసం దాదాపుగా 30 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం.
తెరపై కనిపించే ప్రతీ సన్నివేశానికీ సెట్ వేయడం అవసరమైందట. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కాలంలో ఇళ్లు ఎలా ఉంటాయో, అప్పుడు రాయలసీమ వాసులు ఎలాంటి దుస్తుల్ని ధరించేవారో చెప్పడానికి ఫొటోగ్రాఫ్స్ ఏమీ దొరకలేదని, పుస్తకాలలో చదివిన విషయాల్ని ఊహించి, వాటి అనుగుణంగా సెట్స్‌ని, కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేశామని రాజీవన్ చెబుతున్నారు. ఈ సినిమా కోసం 22 మంది టైలర్లు దాదాపు 150 రోజుల పాటు కష్టపడి 15 వేల దుస్తుల్ని డిజైన్ చేశారు. తెరపై ప్రతీదీ సహజంగా కనిపించాలన్న తపనతో కష్టపడ్డామని, అలాగని చరిత్రకు దూరంగా వెళ్లలేదని కళా దర్శకుడు చెబుతున్నారు.