ఇంకా రాజరిక పరిపాలన కొనసాగుతున్న సౌదీ అరేబియా దేశంలో ఈరోజు ఏకంగా 47మందికి బహిరంగంగా ప్రజల ముందు తలలు నరికి మరణశిక్ష అమలుపరిచారు. మరణశిక్ష విదించబడిన వారిలో అత్యధికులు అల-ఖయిదా ఉగ్రవాదులు, కొందరు షియా తిరుగుబాటుదారులు మరియు నిమ్ర్-అల్-నిమ్ర్ అనే వర్గానికి చెందినవారు ఉన్నట్లు సౌదీ హోం శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. 2003-06 సం.ల మధ్యకాలంలో అల్-ఖయిదా ఉగ్రవాదులు సౌదీపై జరిపిన దాడులలో అనేకవందల మంది పౌరులు మరణించారు. సౌదీపై దాడులు జరిపిన అనేక వేలమంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వారిపై విచారణ జరిపించి మరణశిక్ష అమలుచేస్తోంది. అలాగే 2011-13 సం.ల మధ్యకాలంలో దేశంలో నిర్లక్ష్యానికి అణచివేతకు గురవుతున్న షియా ముస్లింలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసారు. వారిలో 47 మందికి మరణశిక్ష అమలుపరిచారు.
మరణశిక్ష అమలుచేసే ముందు వారి కారణంగా దేశంలో జరిగిన అల్లర్లు, వారి దాడుల్లో మరణించిన పౌరుల వీడియోలను సౌదీ జాతీయ న్యూస్ చానల్లో చూపించి, అటువంటి హేయమయిన నేరాలకు వారు పాల్పడినందుకే మరణశిక్ష విధిస్తున్నట్లు సౌదీ హోం శాఖ తెలియజేసింది. సౌదీ అరేబియా ప్రభుత్వం 2014 సం.లో 90 మందికి, 15సం.లో 157 మందికి ఈ సంవత్సరం మొదట్లోనే ఒకేసారి 47మందికి మరణశిక్ష అమలుచేసింది.
1995సం.లో అత్యధికంగా 192 మందికి మరణశిక్ష అమలుచేసింది. సౌదీ అరేబియా దేశంలో ఈ మరణశిక్షలు ప్రజలందరూ చూస్తుండగానే బహిరంగంగా అమలు చేస్తుంటారు. కనుకనే అక్కడ నేరాలు చేయడానికి అందరూ చాలా భయపడతుంటారు. కనుక నేరాలు తక్కువే. శాంతి భద్రతల సమస్యలు సాధారణంగా తలెత్తవు. సౌదీ ప్రభుత్వం ఇంత క్రూరంగా బహిరంగంగా మరణశిక్షలు అమలుచేయడాన్ని అంతర్జాతీయ మనవ హక్కుల సంఘాలు తప్పు పడుతున్నాయి.