అమరావతి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ నిర్మాణ సంస్థలపై మోజు పడుతుంటే, ఐదు ప్రముఖ భారతీయ నిర్మాణ సంస్థలు అందుకు పోటీ పడటం విశేషం. స్విస్ చాలెంజ్ పద్దతిలో రాజధాని ప్రధాన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సి.ఆర్.డి.ఏ. సంస్థ గ్లోబల్ టెండర్లు పిలిస్తే 7సంస్థలు బిడ్స్ వేశాయి. వాటిలో 5 సంస్థలు భారత్ కి చెందినవి కావడమే విశేషం. క్లిష్టమైన ఈ సవాలుని స్వీకరించడం ద్వారా అవి తమకి అవకాశం కల్పిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నగరం నిర్మించి సత్తా చాటుకోగలవని చెప్పినట్లయింది. ఇది చాలా శుభపరిణామం.
విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని వివాదాలు ఏర్పడితే అంతర్జాతీయ న్యాయస్థానం చుట్టూ తిరగవలసి ఉంటుంది. అదే భారత్ లోని సంస్థలకే ఆ పని కట్టబెట్టినట్లయితే అందరికీ మేలు జరుగుతుంది. ఈ స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కి చెందిన కన్సార్టియం అసెండాస్-సిన్బ్రిడ్జి అండ్ సెంబ్ కార్ప్ డెవలప్మెంట్ కంపెనీ సమర్పించిన బిడ్ లో షరతులు చూసినట్లయితే, వాటి వలన సుదీగ్ర కాలంపాటు సాగే రాజధాని నిర్మాణంలో ఏదో ఒక రోజు తప్పకుండా సమస్యలు వస్తాయని స్పష్టం అవుతోంది. దాని కంటే మెరుగైన బిడ్ సమర్పించిన సంస్థలకే ఈ పని అప్పగించాలనే ఉద్దేశ్యంతోనే గ్లోబల్ టెండర్లు పిలిచారు కనుక, బిడ్స్ దాఖలు చేసిన 5 భారతీయ కంపెనీలలో అత్యుత్తమైన దానిని, ఇటువంటి పనులలో అపార అనుభవం ఉన్నదానిని ఎన్నుకొని దానికే ఈ పని అప్పగించినట్లయితే అందరికీ మంచిది.
రాజధాని నిర్మాణం కోసం బిడ్స్ వేసిన భారతీయ నిర్మాణ సంస్థలలో ఎల్&టి, షాపూర్ జీ పల్లోంజీ, రాంకీ గ్రూప్, ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్,అలియన్స్ ఇన్ఫ్రా సంస్థలున్నాయి. అవికాక చైనాకి చెందిన జీఐఐసీ, చైనా ఫస్ట్ మెటలర్జికల్ కంపెనీలు బిడ్స్ వేశాయి.
వీటిలో బిడ్స్ వేసిన భారతీయ కంపెనీలన్నీ నిర్మాణరంగంలో మంచి అనుభవం ఉన్నవే. వీటిలో ఎల్&టి, షాపూర్ జీ పల్లోంజీ సంస్థలు రెండూ కలిసి ప్రస్తుతం తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్నాయి. మళ్ళీ వాటిలో ఎల్&టి, రాంకీ, ఆదిత్య హౌసింగ్ సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా నిర్మాణపనులు చేస్తున్నాయి. కనుక మన అవసరాలు, పద్దతులు, ఆదాయ వనరులు, కష్టనష్టాలు, రాజకీయాల ప్రభావాల గురించి తెలిసిన భారతీయ నిర్మాణ సంస్థలకే ఈ పని అప్పగించినట్లయితే, మున్ముందు ఎటువంటి సమస్యలు వచ్చినా సులభంగా పరిష్కరించుకొంటూ రాజధాని నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు. ఈ పనికి ఎంపిక ఏ సంస్థని ఎంపిక చేస్తుందనే దానిలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞత బయటపడుతుంది. త్వరలో ఆ సంగతీ తెలిసిపోతుంది.